ఇండియన్ 2 చూస్తూ తట్టుకోలేక.. తనపై తాను మర్మకళ ప్రయోగించుకున్న డైరెక్టర్!
తమిళ దర్శక దిగ్గజం శంకర్, అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ కలయికలో ఎప్పుడో 1996లో వచ్చిన భారతీయుడు వెండితెరపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక స్వాతంత్ర్య సమర యోధుడు దేశంలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు పోరాడుతూ.. చివరికి తన కన్న కొడుకునైనా సరే చంపడమే ఈ సినిమా వృత్తాంతం. అందులో కమల్ హాసన్ నట విశ్వరూపం, దేశభక్తి, స్వాతంత్య్రోద్యమ నేపథ్యం, పాటలు, శంకర్ టేకింగ్ అన్ని సమపాళ్లలో కుదిరి ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.
దాదాపు 28 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా రిలీజైన భారతీయుడు-2పై భారీ అంచనాలు ఉన్నాయి. వెండితెరపై శంకర్ తన మార్క్ చూపించి చాలా కాలం అయ్యింది. రజనీకాంత్‌తో తెరకెక్కించిన రోబో తర్వాత శంకర్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సత్తా చాటడం లేదు. ఈ నేపథ్యంలో ఓ సాలిడ్ హిట్ కొట్టి తనలో వాడి ఏమాత్రం తగ్గలేదని ఆయన నిరూపించుకోవాలనుకున్నారు. కమల్‌కు తోడు సిద్ధార్ధ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా వంటి భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో భారతీయుడు-2పై అంచనాలు పెరిగిపోయాయి.

కోవిడ్, లాక్‌డౌన్‌తో పాటు ఎన్నో వాయిదాలు, అవాంతరాలను అధిగమిస్తూ ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు -2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. కథ, కథనం సరిగా లేకపోవడం, కమల్ హాసన్ పాత్ర తీరు తెన్నులు అంతగా ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకుడికి భారతీయుడు -2 అంతగా కనెక్ట్ కాలేదని సోషల్ మీడియా టాక్. ఇది అసలు శంకర్ తీసిన సినిమానా లేక ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ తీశాడా అంటూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
శంకర్ టేకింగ్ అంటే ఓ బ్రాండ్.. ఆ కథ చెప్పే విధానం, పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయని సగటు ప్రేక్షకుడు ఊహించుకుని వెళ్తాడు. అలాంటిది భారతీయుడు-2లో శంకర్ మార్క్ కనిపించకపోవడంతో జనం తెల్లమొహం వేస్తున్నారు. శంకర్ 1996లోనే ఆగిపోయారని, ఇంకా అప్‌డేట్ కాలేదని కౌంటర్లు వేస్తున్నారు. సినిమా ఫస్టాఫ్‌లో తొలి 20 నిమిషాలు తప్పించి, మిగిలినదంతా బోరింగ్‌గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిని గమనించిన చిత్ర యూనిట్ ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్న ఓ 20 నిమిషాల కంటెంట్‌ను ట్రిమ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుండగా .. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు భారతీయుడు -2 చిత్రాన్ని వీక్షించారు. వంశీధర్ గౌడ్ అనే ఓ యువ దర్శకుడు ఈ సినిమా చూస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా తన ఎక్స్‌పెక్టేషన్స్‌కు దగ్గరగా ఉండటంతో వంశీధర్ ఈ సినిమాలోని మర్మకళ మాదిరిగా తన రెండు వేళ్లు మడతబెట్టి గొంతులో పొడుచుకుని చనిపోయినట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఇది కాస్తా ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లడంతో.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. వంశీధర్ ఎక్స్‌ప్రెషన్స్‌ను బట్టి భారతీయుడు సినిమా అలా ఉందన్న మాట అంటూ చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











