టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో యువ దర్శకుడు కన్నుమూత
కరోనావైరస్ తెలుగు సినీ పరిశ్రమను వెంటాడుతున్నది. గత కొద్ది రోజులుగా చాలా మంది కరోనాబారిన పడి మృత్యువాత పడ్డారు. ఇలాంటి విషాదంలో ఉండగానే టాలీవుడ్‌ను మరో దుర్వార్త విషాదంలో ముంచెత్తింది. తాజాగా మరో టాలీవుడ్ దర్శకుడిని బలి తీసుకొన్నది. కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న దర్శకుడు వట్టి కుమార్ కన్నుమూశారు. ఈ మరణవార్తతో సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
వట్టి కుమార్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన వారు. అవివాహితుడైన ఆయన వయసు 39 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ నుంచి సొంత పట్టణానికి వెళ్లారు. అక్కడ జ్వరం తీవ్రత పెరగడం, కరోనావైరస్ అని నిర్ధారణ కావడంతో జేమ్స్ అనే హాస్పిటల్‌లో చేరారు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్య మెరుగుపడుతుందని స్నేహితులకు సమాచారం అందించారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్లాస్మా ఎక్కించారు. ఆ క్రమంలోనే ఆయన మరణించినట్టు స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకు అసోసియేట్‌గా పనిచేస్తున్నారు.

శ్రీవిష్ణు, చిత్ర శుక్లా నటించిన మా అబ్బాయి చిత్రంతో వట్టి కుమార్ దర్శకుడిగా మారారు. చాలాకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో పలు విధాలుగా సేవలందించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి కుమార్ వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో చికిత్స తీసుకొంటూ మెరుగుపడే క్రమంలో ఆకస్మికంగా మృతి చెందారు.

వట్టి కుమార్ మృతితో దర్శకుడు వేణు ఊడుగుల భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేస్తూ.. అమానవీయ రాజకీయ సందర్బాన , ఈ నేలనేలంతా వల్లకాడై ,వలపోత చరిత్రని మిగిలుస్తోంది. మన పుణ్య భూమి ముఖచిత్రంపై ఒక్కో మరణం ఒక్కో విషాద వాఖ్యముగా పరివ్యాప్తమవుతుంది .
కరోనతో దూరమైన ఆత్మీయుడు ,దర్శకుడు కుమార్ వట్టి కి దు:ఖ విచలిత నేత్రాలతో ఆల్విదా! @vatti_kumar అంటూ శ్రద్దాంజలి ఘటించారు.


Click it and Unblock the Notifications











