జూనియర్ ఎన్టీఆర్ అసలు నా మైండ్‌లోనే లేడు.. వైవీఎస్ చౌదరి సంచలన వ్యాఖ్యలు
యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి అంటే ఎవరికీ టక్కున గుర్తురాకపోవచ్చు. కానీ వైవీఎస్ చౌదరి అంటే చాలు ఇట్టే చెప్పేస్తారు. నటరత్న నందమూరి తారక రామారావుకి వీరాభిమాని అయిన చౌదరి.. పెద్దాయన స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. '' శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ''తో దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, నిప్పు, రేయ్ సినిమాలు తీశారు.
దర్శకత్వం వహిస్తూనే బొమ్మరిల్లు బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగానూ మారారు. అయితే ఒక్క మగాడు, నిప్పు, రేయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొని పరిశ్రమకు దూరమయ్యారు. తాను జీవితంలో యేటికి ఏదురిదీ చేసిన యుద్ధాలేనని.. చావుకు మనం భయపడకూడదని, చావే మనల్ని చూసి భయపడాలని , మందని వేసుకుని దున్నపోతులా తిరగడం కాదు.. ఒక్కడే తిరగాలని నమ్ముతానని.. వీటినే డైలాగ్స్‌గా పెట్టానని వైవీఎస్ చౌదరి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అడపాదడపా సినిమా ఈవెంట్‌లకు హాజరవుతూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చౌదరి మరోసారి సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ పెద్దకుమారుడు నందమూరి తారక రామారావును ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం చౌదరి తెలిపారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్ రోర్స్ అనే కొత్త బ్యానర్‌ను ఆయన స్థాపించారు. దీనిపైనే హరికృష్ణ మనవడితో సినిమా చేస్తున్నారు చౌదరి.
అయితే నందమూరి ఫ్యామిలీలో హరికృష్ణ, బాలకృష్ణలతో సినిమాలు తీసిన వైవీఎస్ చౌదరి.. ఆ వంశంలోని మూడో తరం నటుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా ఎందుకు తీయలేదని ఇండస్ట్రీలో ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటిపై చౌదరి ఏనాడూ స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో హరికృష్ణ మనవడితో చేస్తున్న సినిమా సంగతులను పంచుకోవడానికి హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. బొమ్మరిల్లు బ్యానర్‌ను మార్చలేదని దానికి తానే ప్రొడ్యూసర్‌నని, న్యూ టాలెంట్ రోర్స్‌కి తన భార్య నిర్మాత అని తెలిపారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎందుకు సినిమా చేయలేదని విలేకరులు ప్రశ్నించగా.. చౌదరి తనదైనశైలిలో స్పందించారు. తాను రెండు మూడేళ్లకో సినిమా చేస్తానని.. కథను తానే సొంతంగా రాసుకోవడం వల్ల ఆలస్యమవుతుందని చౌదరి చెప్పారు. తాను అనుకున్న కథకు ఎవరు సరిపోతారో వారిని సెలెక్ట్ చేసుకుంటానని, ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనే ఆలోచనే ఇంత వరకు తనకు రాలేదని.. ఆ ఐడియా వస్తే ఖచ్చితంగా తారక్‌ను అప్రోచ్ అవుతానని వైవీఎస్ చౌదరి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌తో ఖచ్చితంగా సినిమా తీయాలని తారక్ అభిమానులు వైవీఎస్‌ను కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











