పావలా శ్యామల కోసం రంగంలోకి ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్.. సాయం చేయమని కోరుతూ!
తెలుగులో లేడీ కమెడియన్ గా పాపులర్ అయిన నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె వయోభారంతో పాటు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోంది. తెలుగులో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ఆమె ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు తోడు ఆమె కూతురు ఆరోగ్యం కూడా బాగోక పోవడంతో ఇల్లు గడవని స్థితిలో ఉన్నారు.
ఈ విషయాన్ని కరాటే కళ్యాణి వెలుగులోకి తీసుకురాగా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆమెకు తమ వంతు సహాయం చేస్తున్నారు. దర్శకుడు శివనాగేశ్వరరావు బంధువులు 50 వేలు సాయం చేయగా నటుడు జీవన్ కుమార్ కూడా నిత్యావసర వస్తువులతో పాటు కొంత నగదు అందజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెకు మా మెంబర్షిప్ నిమిత్తం 1,11,500 రూపాయలు అందజేశారు. ఈ మెంబర్షిప్ తో ఆమెకు ప్రతి నెల ఆరు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది..

అయితే తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన తెలుగు దర్శక ద్వయం రాజ్ డీకేలు ఆమెకు సహాయపడేందుకు ఒక ఫండ్ రైజర్ ఏర్పాటు చేశారు.. ఆమె ఇబ్బందుల్లో ఉన్నారని ప్రస్తుతం ఇబ్బందుల నుంచి దూరం చేసేందుకు ఈ సహాయం అడుగుతున్నామని వారు పేర్కొన్నారు. ''మా వంతు సహాయం మేము చేస్తున్నాము, మీకు కూడా ఏమైనా సహాయం చేయాలని ఉంటే డబ్బులు పంపండి అంటూ ఆ లింకు కూడా వారు షేర్ చేశారు. 5 లక్షల టార్గెట్ తో ఈ ఫండ్ రైజర్ ప్రారంభించగా ఈ ఆర్టికల్ రాసే సమయానికి 126000 సమకూరాయి. మొత్తం మీద పావలా శ్యామలకు అండగా నిలబడటానికి ఇండస్ట్రీ నుంచి ఇంత మంది ముందుకు రావడం ఆనందం అందించదగ్గ విషయం.


Click it and Unblock the Notifications











