‘6 నెలల్లో స్టాలిన్ సీఎం అవుతారు... విజయ్ టీవీకేని తరిమికొడతాం’
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్. పార్టీ పెట్టిన రెండేళ్లకే తిరుగులేని మెజారిటీ, ప్రజల ఆశీస్సులతో చరిత్ర తిరగరాశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తర్వాత ముఖ్యమంత్రి అయిన నటుడిగా విజయ్ ఆ దిగ్గజాల సరసన చేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత పాలనపై తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు విజయ్. అయితే టీవీకే చేతిలో ఎదురైన దారుణ పరాజయంపై ప్రతిపక్షాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
దాదాపు 60 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసించిన ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను విజయ్ మట్టికరిపించారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని, సుపరిపాలన అందిస్తానన్న విజయ్ మాటలను విశ్వసించి తమిళ ప్రజలు ఆయనకు భారీ మెజారిటీని కట్టబెట్టారు. అయితే ఎన్నికల్లో టీవీకే 107 సీట్ల వద్దే ఆగిపోవడంతో అధికారానికి కావాల్సిన మరో 11 సభ్యుల బలాన్ని కూడగట్టేందుకు విజయ్ బాగా కష్టపడ్డారు. పలుమార్లు గవర్నర్ కార్యాలయం చుట్టూ తిరిగినా విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు.

అయితే కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్ధతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు విజయ్. వీరిలో ఏ ఒకరు వెనక్కి తగ్గినా విజయ్ ప్రభుత్వం కుప్పకూలుతుందని.. ప్రభుత్వాన్ని నడపటం, హామీలు నెరవేర్చడం అంత ఈజీ కాదని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని దళపతి.. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నుంచి ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపించేందుకు ప్రమత్నిస్తున్నారు. తమిళనాడులో తొలిసారిగా ఓడిపోయిన మాజీ సీఎం ఇంటికి కొత్త సీఎం వెళ్లే సాంప్రదాయానికి తెరదీశారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు విజయ్. ఆ తర్వాత తనకు మద్ధతుగా నిలిచిన అన్ని పార్టీల నేతలను కలిశారు. పాలనా యంత్రాంగంపై గ్రిప్ సాధించేందుకు విజయ్ శ్రమిస్తున్నారు. అయితే విజయ్ కుదురుకుంటే తమకు భవిష్యత్తు కష్టమేనని డీఎంకే, అన్నాడీఎంకే నేతలు లోలోపల వణికిపోతున్నారు.
ఈ నేపథ్యంలో డీఎంకే నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం 6 నెలలకు మించి మనుగడ సాధించలేదని జోస్యం చెప్పారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ త్వరలోనే సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపడతారు. విల్లివాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీవీకే నేత ఆధవ్ అర్జున అక్కడి సీటుకు రాజీనామా చేసి తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. తిరుచెందూర్‌లో మనం తలపడదాం. ఇది మా ఊరు.. ఎవరినైనా సరే మేము ఓడిస్తాం, ఇకపై ఏ ఎన్నికైనా సరే టీవీకేను తరిమి కొడతామని రాధాకృష్ణన్ అన్నారు.
విజయ్ పార్టీ టీవీకేలో చేరి తమ అధినేతను ఓడించిన డీఎంకే అసమ్మతి నేత వీఎస్ బాబుపైనా రాధాకృష్ణన్ మండిపడ్డారు. కొలత్తూరును స్టాలిన్ సింగపూర్‌గా మార్చారు.. కానీ ఓటర్లు ద్రోహులు అంటూ నోరుపారేసుకున్నారు. విజయ్ గెలిచిన తిరుచ్చి ఈస్ట్ నుంచి స్టాలిన్ పోటీ చేయాలి. 4 లేదా 6 నెలల్లో స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి విజయ్ మహిళలను రక్షిస్తానని అన్నారు. కానీ ముందు మీ భార్యకు, బిడ్డలకు సమాధానం చెప్పండి. మీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మీ భార్య గానీ, బిడ్డగానీ హాజరయ్యారా? అని రాధాకృష్ణన్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతుండగా టీవీకే కానీ, ఆధవ అర్జున కానీ ఇంకా స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications


