ప్లీజ్.. వాటిని పాడు చేయొద్దు.. మహేష్ ఫ్యాన్స్‌కు చేతులెత్తి మొక్కిన డైరెక్టర్
భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థతో పాటు అత్యంత కీలకమైనది వివాహం. సమాజం, దేశాభివృద్ధికి మూలం వివాహం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. సామాజిక ఆమోదంతో , చట్టపరమైన అంగీకారంతో స్త్రీ, పురుషులిద్దరూ కలిసి జీవించి బంధాన్ని ఏర్పరచుకునే విధానమే వివాహం. హిందూ ధర్మంలో వివాహాన్ని అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఈ క్రతువులోని ప్రతి అంశానికి శాస్త్రీయ, పురాణ ఔచిత్యం ఉంది. ముఖ్యంగా పాణిగ్రహణం, సప్తపదిని తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన సంస్కారాలుగా పూర్వీకులు చెబుతారు.
ఆధునిక కాలంలో పాశ్చాత్య పోకడలు వెర్రితలలు వేస్తున్నా భారతీయ వైవాహిక వ్యవస్థ తన మనుగడను కొనసాగిస్తూ.. ప్రపంచం చేత జేజేలు అందుకుంటోంది. మూలాలు బలంగా ఉండటం, వివాహాన్ని జీవితంలో అత్యంత ముఖ్యమైనదిగా మన సమాజం భావిస్తుండటం వల్లే ఈ సాంప్రదాయం నేటికీ వెలుగొందుతోంది. అయితే సోషల్ మీడియా , కాల మాన పరిస్ధితులతో కొందరు వివాహాన్ని అపహాస్యం చేస్తున్నారు. క్లాస్ రూమ్‌లో, బస్టాప్‌లో, సమయం , సందర్భం లేకుండా పెళ్లి చేసుకుని దాని గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. ఇవి నిజమైన పెళ్లిళ్లా , లేక రీల్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

ఇదిలాఉండగా.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా మిగిలిన మురారి చిత్రం ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అయ్యింది. రెగ్యులర్ మూవీ రిలీజ్ టైంలో ఎంత హడావుడి చేస్తారో, అంత సందడి చేశారు మహేశ్ ఫ్యాన్స్. విడుదలకు వారం రోజుల ముందు నుంచే టికెట్ల బుకింగ్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, సోషల్ మీడియాలో బజ్ ఇలా నానా హంగామా మొదలైంది. ఇక రిలీజ్ రోజుకు అర్ధరాత్రి ముందు నుంచే సూపర్‌స్టార్ అభిమానులు థియేటర్లకు క్యూకట్టారు.
అంతా బాగానే ఉంది కానీ.. మురారి స్క్రీనింగ్ జరుగుతున్న ఓ థియేటర్‌లో సరిగ్గా అలనాటి రామచంద్రుడి పాట స్క్రీన్‌పై వస్తుండగా మహేశ్ అభిమాని ఒకరు అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతని ఫ్రెండ్స్ ఆడియన్స్‌కి అక్షింతలు పంచడంతో థియేటర్ మొత్తం ఈ కొత్త జంటని ఆశీర్వదించింది. ఈ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. దీనిపై సాంప్రదాయవాదులు, పెద్దలు మండిపడుతున్నారు.
ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు కృష్ణవంశీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్ అభిమాని థియేటర్‌లో పెళ్లి చేసుకున్న వీడియోను ట్విట్టర్‌లో కృష్ణవంశీకి ఓ వ్యక్తి ట్యాగ్ చేసి ఆశీర్వదించండి సార్ అంటూ రాశాడు. అది చూసిన ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఇలా చేయడం సరికాదని, మన సంస్కృతి, సాంప్రదాయాలను అపహాస్యం, అవమానించడం లాంటివి చేయొద్దంటూ దండం పెట్టే ఎమోజీతో కృష్ణవంశీ విజ్ఞప్తి చేశారు. తెలిసో తెలియకో అలా చేసి ఉంటారని.. అయినప్పటికీ వారి జీవితం బాగుండాలని ఆయన రిప్లయ్ ఇచ్చారు. మరోసారి మురారిని ఆదరించిన ప్రేక్షకులకు కృష్ణవంశీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











