Tiger 3: టైగర్ 3 అనుకున్న స్థాయిలో ఆడకపోవడానికి గల కారణాలివే..!
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గత 35 సంవత్సరాలుగా అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నాడు. గతంలో ఇదే పరిస్థితి ఎక్కువగా కనిపించినప్పటికీ ఈ మధ్య మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోతున్నారు. ఈక్రమంలో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలనే ఆలోచనలతో చాలా కష్టపడి టైగర్ 3 సినిమాలో యాక్టింగ్ ఇరగదీశారు.
అయితే సినిమా చాలా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీసు వద్ద మాత్రం అంతా ఊహించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో ఈ చిత్రం విఫలం అవుతోంది. సాధారణంగా చూస్కుంటే ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లు చాలా ఎక్కువే. కానీ గత చిత్రాలతో అంటే టైగర్, టైగర్ 2 సినిమాలతో పోల్చుకుంటే మాత్రం టైగర్ 3 చిత్రానికి చాలా తక్కువ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. అయితే ఇందుకు గల కారణాలు ఏంటో అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కారణాలు తెలియక తలలు పట్టుకునే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ట్రేడ్ పంతుల్లు ఇందుకు గల కారణాలు ఏంటో తాజాగా వెల్లడించారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు స్టార్ హీరోహీరోయిన్లు అయిన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌లుగా చేయడం.. పండుగ సీజన్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని.. కచ్చితంగా హిట్టు కొడుతుందని అంతా భావించారు. మామూలు హిట్టు కూడా కాదు ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతుందనుకున్నారు. కానీ అంచనాలు అన్నీ తారు మారు అయ్యాయి. దీపావళి సమయంలో లక్ష్మీ పూజలు ఉండడం, అలాగే వరల్డ్ కప్ మ్యాచ్ ఉండడంతో ఈ సినిమాపై తీవ్ర ప్రభావం పడిందని చెబుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోను పాకిస్థాన్ అనుకూల వ్యక్తిగా చిత్రీకరించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారని అంతా అనుకుంటున్నారు. దేశం కోసం పని చేసే ఓ స్పై ఏజెంట్ పాక్ అనుకూల వ్యక్తిగా ఎలా అవుతాడని.. లాజిక్ కు అందకుండా ఉండడమే ఈ సినిమాకు మైనస్ అయిందని తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా సినిమాలోని సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా అంత అద్భుతంగా ఏమీ లేదని సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు. వీటికి తోడు.. సినిమాకు ముందు నుంచే పెద్దగా బజ్ క్రియేట్ కావడంతో అంతగా ప్రమోషన్లు కూడా చేయలేదు.

కండలవీరుడి సినిమా మీద నమ్మకంతో యశ్ రాజ్ ఫిల్మ్స్ పెద్దగా ప్రచారం కూడా నిర్వహించలేదు. అలాగే మార్కెటింగ్ అంశాలపై కూడా అంతగా దృష్టి సారించలేదు. ఇవన్నీ కారణాల వల్లే టైగర్ 3 సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతుందని టాక్ నడుస్తోంది. మరోవైపు సినిమా విడుదల అయిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ తన చిత్రానికి ప్రమోషన్లు చేస్తున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ మ్యాచ్ లో కామెంట్రీ ఇచ్చేందుకు వెళ్లి తన సినిమా విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా చివరి వరకు ఎంత మేర కలెక్షన్లు రాబట్టుకుంటుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











