Sekhar Kammula: తెలుగు తెరకు మరో బాపు.. శేఖర్ కమ్ముల టాప్ 5 సినిమాలు ఇవే!
విలక్షణ దర్శకుడిగా పేరొందిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నలు నటించిన కుబేర చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల టేకింగ్, ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితంపై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు. శేఖర్ సినిమాలలో పాటలు, మాటలు, డైలాగ్స్, నటీనటులు అంతా అత్యంత సహజంగా ఉంటాయి. ఆయన సినిమాలలో స్టార్స్ ఉండరు.. ఎందుకంటే శేఖర్ సినిమాలకు కథే సూపర్‌స్టార్. టాలీవుడ్‌కు దొరికిన ఈ విలక్షణ దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో టాప్ 5 ఒకసారి పరిశీలిస్తే..
1972 ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో శేఖర్ కమ్ముల జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతానికి చెందినవారు. హైదరాబాద్‌లోని సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన అనంతరం అమెరికాలో మాస్టర్స్ చేశారు. తర్వాత హోవార్డ్ యూనివర్సిటీలో సినిమాకు సంబంధించిన కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన శేఖర్ కమ్ముల.. 2000వ సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ అనే సినిమా చేశారు. తొలి సినిమాకే అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీలం, పిచ్చిపాటలు, స్టెప్పులు, అడ్డగోలు ఎలివేషన్స్ లేకుండా నీట్‌గా ప్రజెంట్ చేయడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. దిగ్గజ దర్శకులు బాపు, కే విశ్వనాథ్ తర్వాత అంతటి విలక్షణ దర్శకుడిగా మన్ననలు పొందారు శేఖర్. 25 ఏళ్ల కెరీర్‌లో ఆయన చేసింది కేవలం 11 సినిమాలు మాత్రమే. మీ సినిమాలు ఎందుకంత లేట్ అవుతాయంటే .. తాను కథలు కాపీ కొట్టనని, నేను మనసులో అనుకున్నది స్క్రిప్ట్‌గా రావడానికి టైం పడుతుందని చాలా సున్నీతంగా చెప్పేశారు . శేఖర్ కమ్ముల తీసిన 11 చిత్రాల్లో ఆయనకు బాగా నచ్చినవి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాప్ 5 చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే..

ఆనంద్:
2004లో విడుదలైన ఆనంద్ చిత్రం తెలుగు నేలను ఊపేసింది. కథ, డైలాగ్స్‌తో పాటు సంగీతం యువతను ఒక ఊపు ఊపింది. రాజా, కమిలినీ ముఖర్జీ జంటగా నటించిన ఈ సినిమాకు కేఎం రాధాకృష్ణన్ సంగీతం అందజేశారు. ఆనంద్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ కావడంతో పాటు ఏకంగా 6 నంది అవార్డులను తెచ్చిపెట్టింది.

గోదావరి:
2006లో విడుదలైన ఈ సినిమాలో సుమంత్ యార్లగడ్డ, కమిలినీ ముఖర్జీ జంటగా నటించారు. కేఎం రాధాకృష్ణన్ మరోసారి తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. ఈ సినిమాకు సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీలలో ఐదు నంది అవార్డులు వచ్చాయి.

హ్యాపీడేస్:
2007లో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో శేఖర్ కమ్ముల చేసిన మ్యాజిక్ హ్యాపీడేస్. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఉన్న విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో నటించిన వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా భాటియాలు తర్వాతి కాలంలో స్టార్స్‌గా స్థిరపడ్డారు. హ్యాపీడేస్‌కు 3 నంది అవార్డులు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి.

లీడర్:
దగ్గుబాటి వారసుడు రానాను లీడర్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశారు శేఖర్ కమ్ముల. ఇందులో రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్‌లు హీరోయిన్‌లుగా నటించారు. అప్పటి వరకు ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు తీసిన శేఖర్.. ఫస్ట్ టైం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ను టచ్ చేశారు. అవినీతిపై యుద్ధం అనే కాన్సెప్ట్‌ను సరికొత్తగా ఆవిష్కరించారు. 2010లో విడుదలైన లీడర్‌ను ఈ దశాబ్ధంలో విడుదలైన 25 గొప్ప తెలుగు చిత్రాల్లో ఒకటిగా విమర్శకులు ప్రశంసించారు.

ఫిదా:
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో శేఖర్ కమ్ముల ఆవిష్కరించిన అందమైన ప్రేమకథ ఫిదా. ఎన్ఆర్ఐ అబ్బాయి, మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయికి మధ్య ఏర్పడే ప్రేమ, వారి పెళ్లి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వరుణ్ తేజ్, సాయిపల్లవి నటించిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి.


Click it and Unblock the Notifications











