Mahesh Babu : మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు .. ఆ పారితోషికం చుట్టూనే , చిక్కుల్లో సూపర్‌స్టార్
వివాదాలకు దూరంగా, సినిమాలు చేసుకుంటూ .. ఫ్యామిలీతో గడుపుతారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. మీడియాలో కనిపించడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అయితే షూటింగ్ లేకుండా ఇల్లు అన్నట్లుగా మహేశ్ వ్యవహారశైలి ఉంటుంది. ఈ తరం నటుల్లో ఫ్యామిలీని, వృత్తిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్న నటుల్లో మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఆయనను చూసి ఎంతో మంది నేర్చుకుంటున్నారు. తాజాగా మహేశ్ బాబు అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలాగూ ఇచ్చేవే కాకపోతే.. టీవీలు, రేడియోలు, ఆన్‌లైన్‌లో రకరకాల మార్గాల్లో ప్రజలను ఆకర్షించేందుకు కంపెనీలు వల విసురుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులు , ఇతర సెలబ్రెటీలతో బ్రాండ్ అండార్స్‌మెంట్స్ చేయించి బిజినెస్ పెంచుకోవాలని చూస్తుంటాయి. మనదేశంలో చాలా మంది సెలబ్రెటీలు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అండార్స్‌మెంట్స్ చేసి పెడుతున్నారు.

నెలల తరబడి సినిమాలు చేసినా రానంత డబ్బు .. కేవలం 30 సెకండ్ల యాడ్‌లో కనిపించడం వల్ల వస్తుండటంతో సెలబ్రెటీలు వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఎగబడుతున్నారు. క్రేజ్‌ను బట్టి స్టార్స్ ఎంత అడిగినా ఇచ్చేందుకు కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటించి కష్టాలు తెచ్చుకునేవారు లేకపోలేదు. మద్యం, పాన్ , గుట్కా, బెట్టింగ్ యాప్స్, చీట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన ప్రకటనల్లో నటించి చిక్కుల్లో పడ్డ నటీనటులు ఎందరో.
గతేడాది సినీ, రాజకీయ, వ్యాపార రంగాలను కుదిపేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సెలబ్రెటీలు ఈడీ కేసులను ఎదుర్కొన్నారు. తాజాగా తెలుగునాట బయటపడిన సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ స్కాంలోనూ పలువురు స్టార్స్ పేర్లు బయటికి వచ్చాయి. హీరోలు, ఇతర సెలబ్రెటీలతో ఈ వెంచర్లను ప్రమోట్ చేయడంతో వారి మీద నమ్మకంతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులపై తెలంగాణ పోలీసులు కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. పలువురిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా పలువురిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు కూడా.
తాజాగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఈ నెల 27న జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మహేశ్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించిన సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్ట్స్ కేసు విషయంగా ఈడీ ఈ నోటీసులు పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు పంపడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది.
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సురానా గ్రూప్ కార్యాలయాలపై గత వారం ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ కార్యాలయాలపైనా అధికారులు దాడులు చేశారు. ఈ గ్రూప్ ఛైర్మన్ , డైరెక్టర్ ఇతర కీలక వ్యక్తుల ఇళ్లపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. సురానా గ్రూపు.. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్లుగా 2012లోనే సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో భాగంగానే ఈడీ దాడులు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్ బాబుకు ఈడీ నుంచి నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ఈ సంస్థకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించినందుకు గాను మహేశ్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ పారితోషికం చెల్లింపు ఎలా జరిగిందనే దానిపై ఈడీ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











