నంద్యాల ఎస్పీకి చిక్కులు తెచ్చిపెట్టిన అల్లు అర్జున్ ..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల వేళ తెలుగు , సినీ రాజకీయ రంగాలు ఉలిక్కిపడేలా.. కోట్లాది మంది ప్రజలకు షాకయ్యేలా నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన మిత్రుడు శిల్పా రవిని గెలిపించాలని ఆయన నంద్యాల ఓటర్లను కోరారు. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో మకాం వేస్తే.. ఆయనొక్కడే ఇలా విడిగా , అది కూడా పవన్ బద్ధవ్యతిరేకి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బన్నీ ప్రచారం చేయడమేంటి అంటూ మెగా అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న వేళ.. ఏకంగా కేసుల్లోనూ ఇరుక్కున్నారు అల్లు అర్జున్. అది కూడా స్నేహితుడు శిల్పా రవితో కలిసి సంయుక్తంగా. శనివారం నంద్యాల పట్టణంలో తమ అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.

తాజాగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఓ పోలీస్ అధికారిని చిక్కుల్లోకి నెట్టింది. నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఆయనపై ఛార్జెస్ నమోదు చేయాలని సూచించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాదు ఈ ముగ్గురు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో ఆదివారం రాత్రి 7 గంటల్లోగా తెలియజేయాలని సూచించింది.
సినీనటుడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని, ఆయనను చూసేందుకు భారీ జనం ఎగబడ్డారని, సెక్షన్ 144 అమల్లో వున్నప్పటికీ అభిమానులను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యంపై ఎన్నికల సంఘం మండిపడింది. అల్లు అర్జున్ పర్యటనకు అనుమతి లేకపోయినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనిపై అందిన ఫిర్యాదులపై ఈసీ స్పందించింది.

అయితే శిల్పారవికి తాను మద్ధతు పలకడంపై వస్తున్న విమర్శలకు అల్లు అర్జున్ కౌంటరిచ్చారు. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతూ మీడియాతో మాట్లాడిన ఆయన శిల్పా రవిచంద్రారెడ్డి వ్యక్తిగతంగా తనకు స్నేహితుడు కావడంతోనే మద్ధతు పలికినట్లు తెలిపారు. అంతకుమించి ఏ రాజకీయ పార్టీకి తాను సపోర్ట్ చేయడం లేదని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు.
ఇదిలావుండగా.. సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగంటల ముందు ఎన్నికల సంఘం ఏపీలో పలువురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం పాటు కొందరు నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగాలపై ఈసీ తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వీరిని జగన్మోహన్ రెడ్డి, అంజూ యాదవ్, అమర్‌నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లుగా తెలిపారు.


Click it and Unblock the Notifications











