Saif Ali Khan: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ చేతికి కీలక ఆధారాలు..సైఫ్ కేసులో కీలక మలుపు!
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌పై హత్యాయత్నం ఘటన దేశ సినిమా పరిశ్రమను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. గురువారం (జనవరి 16) తెల్లవారు జామున జరిగిన దారుణ సంఘటనతో దేశ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు ఈ అమానుష చర్యతో నిర్ఘాంతపోయారు. అయితే ఈ హై ప్రొఫైల్ కేసు మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయడానికి టాప్ పోలీస్ ఆఫీసర్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌ను రంగంలోకి దించారు. అయితే తొలి రోజే ఈ కేసును తనదైన శైలిలో ఓ కొలిక్కి తెచ్చారనే విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన మలుపుల వివరాల్లోకి వెళితే..
సైఫ్ ఆలీ ఖాన్‌పై దాడి జరిగిందే వార్తతో ముంబై నగరం నిద్రలేచింది. ఈ ఘటనతో ముంబై క్రైమ్ బ్రాంచ్, ఇతర పోలీసులు రంగంలోకి దిగారు. సైఫ్ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ అనేక కోణాల్లో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారని అధికారులు వెల్లడించారు. ఇంటిలోకి వచ్చిన వారెవరు? సిబ్బంది వివరాలను నోట్ చేసుకొన్నట్టు తెలిసింది.

మహారాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజ్‌గా నిలిచిన ఈ కేసును దయా నాయక్ తనదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటిలో పనిచేసే సిబ్బంది సెల్‌ఫోన్లను ముందుగా సీజ్ చేసి కాల్ డేటాను పరిశీలించే పనిలో ఉన్నారు. అలాగే ఇంటి నుంచి, ఇంటి పరిసర ప్రాంతం నుంచి వెళ్లిన కాల్స్‌పై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. మొబైల్ ఫోన్ డేటాతో కేసు పురోగతి సాధించినట్టు తెలుస్తున్నది.
అయితే సైఫ్ ఇంటిలోకి కొత్తగా వచ్చిన వారెవరూ లేరని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన అగంతకుడి ఫోటోను సేకరించారు. అతడి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. నగరంలోని నేరస్థులను పిలిపించి ప్రాథమికంగా విచారణ చేపట్టినట్టు తెలిసింది. దాంతో ఈ కేసు త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని నగర పోలీసులు అంచనాకు వచ్చారని సమాచారం.

ఇదిలా ఉండగా, సైఫ్‌పై దాడి అనంతరం లీలావతి హాస్పిటల్ వర్గాలు సర్జరీ నిర్వహించి.. వెన్నుముకలో విరిగిన కత్తి ముక్కను బయటకు తీశారు. అలాగే వెన్నుముక నుంచి జరుగుతున్న రక్తస్రావాన్ని నిలువరించే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యారు. అనంతరం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి.. సైఫ్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు. ఆయన వైద్యానికి వేగంగా స్పందిస్తున్నారు అని వైద్యులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
ఇక సైఫ్ వేగంగా కోలుకోవాలని తెలుగు సినిమా పరిశ్రమతోపాటు హిందీ సినిమా ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా సందేశాలు పోస్టు చేశారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సోను సూద్ లాంటి ప్రముఖులు ట్వీట్ చేశారు. ఆలియా, రణ్‌బీర్ కపూర్, షారుక్ ఖాన్ స్వయంగా హాస్పిటల్‌కు వెళ్లి కరీనా కపూర్ కుటంబానికి మనోధైర్యాన్ని నింపారు.


Click it and Unblock the Notifications











