ఆ మాట రామోజీ గారు అనడంతో..సుమన్, నేను ఈటీవీలో క్షణం కూడా ఉండలేకపోయాం: ఈటీవీ ప్రభాకర్
ఈటీవీ ద్వారా ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు , దర్శకులు, గాయనీ గాయకులు తెలుగు తెరకు పరిచయమై ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇలాంటి వారిలో ఒకరు ప్రభాకర్ ఒకరు. ఏళ్లుగా ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. ప్రభాకర్ అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చేమో కానీ ఈటీవీ ప్రభాకర్ అంటే ఎవరికైనా గుర్తొస్తారు.
టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ఆయనను ముద్దుగా పిలుచ్చుకుంటారు. ఈటీవీ బిగినింగ్ రోజుల్లో రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్‌కే ఆయన ఎక్కువ విలువనిచ్చే వారని ఇండస్ట్రీలో టాక్. ఈటీవీ నిర్వహణలో ప్రభాకర్ జోక్యం చేసుకున్నారనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. ఈ క్రమంలోనే రామోజీరావు ఆగ్రహానికి ప్రభాకర్ గురయ్యారని.. అందుకే ఈటీవీ నుంచి తప్పించారని ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారు.

ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాకర్ మాట్లాడుతూ.. రామోజీ, సుమన్‌లతో అనుబంధం, ఈటీవీలో తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామోజీ- సుమన్‌లకు పర్సనల్‌గా గొడవ జరిగినా తానే కనిపించేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. సుమన్ ఏదైనా ఐడియా చెబితే.. వెంటనే కొందరు రామోజీరావుతో లేనిపోని మాటలు చెప్పేవారని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో ఈటీవీ వ్యవహారాలను 2 గంటల నుంచి 4 గంటల వరకు రామోజీరావుకు సంబంధించిన మనుషులు చూసేవాళ్లని.. 4 తర్వాత సుమన్‌కు సంబంధించిన మనుషులు చూసేవాళ్లని వెల్లడించారు.
అయితే 2 - 4 మధ్యలోని కార్యక్రమాలు, డబ్బింగ్ సీరియల్స్ వల్ల నాకు ఎఫెక్ట్ అవుతోందని సుమన్‌తో చెప్పానని ప్రభాకర్ పేర్కొన్నారు. దీంతో ఆయన మార్పులు చేసుకోమని చెప్పారని.. సుమన్ నుంచి పర్మిషన్ రావడంతో తాను అలాగే చేశానని ప్రభాకర్ తెలిపారు. విషయం రామోజీరావు వరకు వెళ్లడంతో సుమన్‌ని పిలిపించి మాట్లాడారని పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ వల్ల మా ఇద్దరికీ అనవసరంగా గ్యాప్ వస్తుందని పెద్దాయన సీరియస్‌గా తీసుకున్నారని ప్రభాకర్ తెలిపారు. ఓ రోజు షూటింగ్‌లో ఉండగా రామోజీరావు సెక్రటరీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. సార్ మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పడంతో తాను మధ్యలోనే వెళ్లానని చెప్పారు.
తన జీవితంలో ఫస్ట్ టైమ్ రామోజీరావును కలవబోతున్నానని.. లైఫ్‌లో ఎవరైనా ఒకసారి ఆయనని కలవాలని అనుకుంటారని , అలాంటి వ్యక్తిని చూడబోతున్నందుకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు. లోపలికి వెళ్లాక.. సుమన్‌కి, నీకు మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావని పెద్దాయన కాస్త గట్టిగానే అన్నారని ప్రభాకర్ తెలిపారు. తానేం చేశానని అడగ్గా.. నేను డెసిషన్ తీసుకున్న విషయంలో మీరేందుకు వేలు పెట్టారని రామోజీరావు ప్రశ్నించారని చెప్పారు.

ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఎంత పోయింది, ఎంత వచ్చింది తెలుసా అని రామోజీ అడగ్గా.. తాను వాదించినట్లుగా మాట్లాడటంతో ఆయనకు కోపమొచ్చి ఎక్స్‌ట్రాలు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారని ప్రభాకర్ తెలిపారు. మిమ్మల్ని కలవడమే అదృష్టంగా భావిస్తున్నానని, కానీ ఇలాంటి పరిస్ధితుల్లో కలవడం బాధగా ఉందని చెప్పానని అన్నారు. ఏం అన్నా వినే పరిస్థితుల్లో పెద్దాయన లేరని.. దీంతో ఇప్పటికిప్పుడు సంస్థను వదిలేసి వెళ్తానంటే మీ ఇష్టమని చెప్పారని ప్రభాకర్ వెల్లడించారు.
ఛైర్మన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి నేరుగా సుమన్ దగ్గరికి వెళ్లానని , ఈటీవీని వదిలి వెళ్లిపోతున్నానని చెప్పడంతో ఆయన కూడా రాజీనామా చేస్తానని అన్నారని తెలిపారు. అప్పటికి సుమన్ ఎండీ కావడంతో మీరు అలాంటి పనులు చేస్తే గొడవ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి వారించానని.. అయినప్పటికీ వినకుండా తాను వెళ్లిపోయిన పది నిమిషాలకే, ఆయన కూడా రాజీనామా చేశారని ప్రభాకర్ చెప్పారు. దీనంతటికీ తెలియకుండా తానే కారణమయ్యానని.. నేను పెద్దాయన దగ్గర తగ్గిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











