Pradeep Kottayam: సినీ ఇండస్ట్రీకి మరో షాక్.. ఏమాయ చేశావే నటుడు కన్నుమూత
దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఇండస్ట్రీలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇది చాలదన్నట్లుగా కొంత కాలంగా దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. కోవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. చాలా కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న వాళ్లు మరణించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రముఖ కంపోజర్, సింగర్ బప్పీలహరి మరణించారు. అది మరువక ముందే తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర సంఘటన జరిగింది.
దాదాపు ఇరవై ఏళ్లుగా మలయాళ సినీ పరిశ్రమలో సహాయ నటుడిగా, కమెడియన్‌గా నటించి ప్రేక్షకులను అలరించిన కొట్టాయం ప్రదీప్ (61) గురువారం ఉదయం కన్నుమూశారు. తనదైన కామెడీతో ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తోన్న ఈ సీనియర్ నటుడు.. ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. దీంతో తీరిక లేని షెడ్యూళ్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. అయితే, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధృవీకరించినట్లు మలయాళ మీడియా ద్వారా తెలిసింది.

సీనియర్ నటుడు కొట్టాయం ప్రదీప్ మరణంతో మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై ప్రముఖ నటుడు, దర్శకులు, టెక్నీషియన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు. అంతేకాదు, కొట్టాయం ప్రదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ సహా ఎంతో మంది హీరోలు ఈ సీనియర్ నటుడికి నివాళి అర్పించారు. అలాగే, ఆయన అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రదీప్ అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. కొట్టాయం ప్రదీప్ ఆరంభంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (LIC)లో ఉన్నత పదవిలో పని చేశారు. ఆ తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో 40 ఏళ్ల వయసులో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. కెరీర్ ఆరంభంలో కామెడీ పాత్రలు మాత్రమే చేసిన ఈయన.. ఆ తర్వాత విభిన్నమైన రోల్స్‌లో కనిపించారు. ఇలా సుదీర్ఘమైన కెరీర్‌లో దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించాడు. అందులో 'ఒరు వడక్కన్ సెల్ఫీ', 'కుంజిరామాయణం', 'ఆడు ఒరు భీగర జీవి ఆను', 'వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు', 'కట్టపనయిలే రిత్విక్ రోషన్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి సినిమాలు కొట్టాయం ప్రదీప్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇక, అక్కినేని నాగ చైతన్య - సమంత జంటగా నటించిన 'ఏమాయ చేశావే' సినిమాలోనూ కొట్టాయం ప్రదీప్ నటించారు. ఇందులో జార్జ్ అంకుల్ అనే పాత్రతో తెలుగు వాళ్లనూ పలకరించారు. ఈ చిత్రం ఆయనకు మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఇదిలా ఉండగా.. కొట్టాయం ప్రదీప్‌కు భార్య మాయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Click it and Unblock the Notifications











