‘మెగా ఫ్యామిలీ జోలికొస్తే.. అల్లు అర్జున్ అయినా.. మరో హీరో అయినా అదే గతి’
మెగా ఫ్యామిలీలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన ఒక్కడి వాళ్ల కుటుంబంలో చీలిక రావడమే గాక.. మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య కూడా గ్యాప్ మరింత పెరుగుతోంది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి మొన్న నంద్యాలలో జగన్ పార్టీకి ప్రచారం చేసేవరకు మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించే పనుల వరకు అభిమానుల దృష్టిలో బన్నీ ముద్దాయిగా నిలుస్తున్నారు. ఇవి ఆయన కావాలని చేశారా లేక పరిస్ధితుల ప్రభావమా అన్నది తెలియకపోయినా అల్లు అర్జున్ రేపిన తుఫాను మాత్రం బీభత్సం సృష్టిస్తోంది.
ఇదంతా మీడియా సృష్టేనని, మెగా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారని చెప్పుకోవడానికి లేదు. పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్‌లో బన్నీ కానీ , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు. నాగబాబు, సాయిథరమ్ తేజ్‌లు అల్లు అర్జున్‌పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకుని గొడవను చక్కదిద్దినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపించాయి. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప - 2 వాయిదా పడటం అనేక అనుమానాలకు తావిచ్చింది.

మెగా, పవన్ ఫ్యాన్స్‌కి భయపడే ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్‌కి మారిందని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. అయితే పుష్ప-2 పోస్ట్‌పొన్ కావడం వెనుక ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయనుకోండి అది వేరే విషయం. మెగా, అల్లు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు సైతం ఈ విభేదాలను ధృవీకరించేలా మొన్నామధ్య ప్రెస్‌మీట్‌లో మాట్లాడటాన్ని తేలికగా తీసుకోవడానికి లేదు.
ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉండేవాళ్లు, అభిమానులు బన్నీ పేరు చెబితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జబర్దస్త్ కిరాక్ ఆర్పీ అయితే శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడాన్ని తప్పుబడుతూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శించారు. పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీకి బన్నీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానని చెప్పుకొచ్చారు.

తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ మూవీ గబ్బర్ సింగ్‌లో అంత్యక్షరి గ్యాంగ్‌లో ఒకడైన సాయిబాబా అనే నటుడైతే ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనని కరాఖండీగా తేల్చిచెప్పేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బన్నీ బిహేవియర్ తనకు నచ్చదని, సెల్ఫీ, ఆటోగ్రాఫ్ కోసం వచ్చే అభిమానులను ఆయన తన్నడాన్ని చూశానని సాయిబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ హీరో అలా చేసినా నచ్చదని.. హిట్లు, ఫ్లాప్‌లు ఎన్నో వస్తాయని కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మరిచిపోకూడదని సాయిబాబా తెలిపారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనను తిట్టినా పర్లేదని.. పుష్ప-2 డేట్ ఇంకా ఛేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొన్న ఆరు నెలలు వాయిదా పడింది.. ఈసారి మరో ఆరు నెలలు వాయిదా పడుతుందని, బన్నీకి చాలా ఇగో ఉందని అనుకుంటున్నానని, దానిని తగ్గించుకుంటే మంచిదని సాయిబాబా హితవు పలికారు. మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసునని.. కొంతమంది ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సాయిబాబాపై బన్నీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.


Click it and Unblock the Notifications










