ఆ కలెక్షన్స్ మీకే.. జవాన్ ఫ్యామిలీకి మ్యూజిక్ డైరెక్టర్ ప్రామీస్.. లైవ్‌లోనే ట్రాన్స్‌ఫర్ చేసిన హీరో
ఆపరేషన్ సిందూర్‌లో అమరుడైన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలో బాయ్ చిత్ర యూనిట్ కూడా వీర జవాన్‌కు అండగా నిలిచింది. జూన్ 18న హైదరాబాద్‌లో జరిగిన సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మురళీ నాయక్ తల్లిదండ్రుడు శ్రీరాం నాయక్, జ్యోతిబాయి దంపతులు హాజరుకావడంతో ఈ కార్యక్రమం ఎమోషన్‌గా సాగింది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో గౌతమ్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ స్రవంతిలు మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ వివరాల్లోకి వెళితే..
గౌతమ్ హీరోగా సోలో బాయ్
బిగ్‌బాస్ తెలుగు మెగా షోలో రెండు సార్లు కంటెస్టెంట్‌గా పాల్గొనడంతో పాటు 8వ సీజన్‌కు రన్నరప్‌గా నిలిచారు డాక్టర్ గౌతమ్. బిగ్‌బాస్‌లో తన వ్యక్తిత్వం, దూకుడుతో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించిన గౌతమ్ హీరో స్థాయికి ఎదిగాడు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన చిత్రం సోలో బాయ్. ఈ సినిమాలో గౌతమ్ సరసన రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి ఆడిపాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చాలా రోజుల తర్వాత సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రానికి పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహించగా.. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.

చీఫ్ గెస్ట్‌లుగా మురళీ నాయక్ పేరెంట్స్
సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దివంగత వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతిబాయి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టర్స్ కూడా రిలీజ్ చేసిందీ. దీంతో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం టాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సోలో బాయ్ సినిమా బాగా ఆడాలని మురళీ నాయక్ తల్లిదండ్రులు ఆకాంక్షించారు. స్టేజ్ మీద ఉన్నంత సేపు మురళీ నాయక్ తల్లి ఏడుస్తూనే ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ స్రవంతి చొక్కారపు ఎమోషనల్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీని తిరిగి తీసుకురాలేకపోయినా.. తమ వంతుగా ఆర్ధిక సాయం చేస్తామని చెప్పింది. దీనిలో భాగంగా లక్ష రూపాయలను ఈవెంట్ అవ్వగానే వారికి ట్రాన్స్‌ఫర్ చేస్తానని తెలిపింది.
మురళీ నాయక్ కోసం కచేరీ
ఆ వెంటనే సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పడం తనను కలచివేసిందన్నారు. వారి కోసం తాను త్వరలోనే అనంతపురంలో మ్యూజిక్ షో చేస్తానని, వీలైనంత మంది సింగర్స్‌ని తీసుకొచ్చి మేమంతా మురళీ నాయక్ కోసం ప్రదర్శన చేస్తామని ఆర్పీ పట్నాయక్ హామీ ఇచ్చారు. ఈ కచేరీ ద్వారా వచ్చే డబ్బంతా మీ కుటుంబానికి అందేలా చూస్తానని తెలిపారు. వచ్చే నెలలో తాను అమెరికా వెళ్తున్నానని, తిరిగి ఇండియా రాగానే ఈ ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తానని పట్నాయక్ తెలిపారు.
లైవ్‌లో నగదు ట్రాన్స్‌ఫర్ చేసిన గౌతమ్
చివరిలో హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. పాతికేళ్ల వయసులో ఉండే కుర్రాళ్లు మందు కొడుతూ, అమ్మాయిలతో తిరుగుతుంటారు. కానీ మురళీ నాయక్ బోర్డర్‌లో మనదేశం కోసం ప్రాణాలు అర్పించాడని ప్రశంసించారు. ఆ కుర్రాడిలో అంత ధైర్యం, సాహసం ఆ అబ్బాయిలో ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించానని .. ఎంతో కష్టపడి మురళిని తల్లిదండ్రులు చదివించి దేశ సేవకు పంపించారని వీళ్ల కంటే పెద్ద సెలబ్రెటీ ఎవరుంటారని గౌతమ్ ప్రశ్నించారు. బిగ్‌బాస్ ద్వారా నేను 30 లక్షలు సంపాదించానని, అందులో 15 లక్షలు సమవర్తి ట్రస్ట్ ద్వారా డొనేషన్ చేస్తున్నానని .. ఇందులో ఫస్ట్ డొనేషన్ మురళీ నాయక్ గారి ఫ్యామిలీకి లక్ష రూపాయలు సభాముఖంగా ఇస్తున్నానని చెప్పారు. అదే స్టేజ్‌పై నుంచి జవాన్ తల్లిదండ్రుల ఖాతాలోకి నగదు ట్రాన్స్‌ఫర్ చేశారు గౌతమ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆర్పీ పట్నాయక్, గౌతమ్ కృష్ణ, యాంకర్ స్రవంతిలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











