Gantasala Biopic ఎస్పీ బాలు చెప్పడం వల్లే.. ఘంటసాల ది గ్రేట్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?
భారతీయ సినిమా సంగీత చరిత్రలో ఘంటసాల వెంకటేశ్వరరావుకు గొప్ప చరిత్ర ఉంది. సినిమా సంగీతాన్ని తెలుగు ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప గాయకుడే కాకుండా సంగీత దర్శకుడిగా ఎన్నో అద్బుతమైన సినిమాలకు పనిచేశారు. ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో తన పాటలతో చెరుగని ముద్ర వేశారు.
అలాంటి అమర గాయకుడు ఘంటసాల జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్ జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సీ కల్యాణ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, బాబ్జి, బాలాజీ కర్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ వివరాల్లోకి వెళితే..

అన్యుక్తరామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జీవీ భాస్కర్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఘంటసాల యువ సింగర్ కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రిగా మృదుల నటిస్తున్నారు. ఘంటసాల పాటశాల సంకలన కర్త సీహెచ్ రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఘంటసాల టైటిల్ రోల్ పోషిస్తున్న కృష్ణచైతన్య మాట్లాడుతూ .. ఘంటసాల పాత్ర పోషించడం ఓ గాయకుడిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచానికి ఆయన గాయకుడిగానే తెలుసు. ఆయన ఎదుగుదలలో ఎదురైన ఆటుపోట్లు, ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి అని తెలిపారు.
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ ''ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాలగారి మీద ఉన్న అభిమానంతో దర్శకుడు రామారావు ఈ ప్రయత్నం చేశారు.ఈ సినిమాను సూపర్‌హిట్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులు అందరినీ కోరుతున్నా అని అన్నారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడారు. ఘంటసాలగారి పాట భూమి, ఆకాశాలు ఉన్నంతకాలం చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ఆయన భౌతికంగా లేకపోయిన ఆయన పాటలు ప్రపంచం మొత్తం మార్మోగుతూనే ఉంటాయి. భావితరాలకు ఆయన చరిత్ర తెలియ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆయన చరిత్రను పుస్తకాల్లో సిలబస్‌గా ఉంచడం ప్రభుత్వాల బాధ్యత. ఘంటసాల గారికి రావల్సిన గుర్తింపు చాలా ఉంది అని అన్నారు.
చిత్ర నిర్మాణ సారథి జీవీ భాస్కర్ మాట్లాడుతూ.. 2018లో ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలుగారి చేత విడుదల చేయించి ఎంతో పేరు సంపాదించాం. తదుపరి పలు కారణాల వల్ల ఘంటసాల కుటుంబంతో లీగల్‌గా చిన్నచిన్న సమస్యలొచ్చాయి. అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆయన కుటుంబం నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఈ సినిమా విషయంలో లక్ష్మీ ప్రసాద్, మాధవపెద్ది సురేష్‌గారు అందించిన సహకారం మరువలేనిది. త్వరలో ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమాను విడుదల చేస్తాం అని అన్నారు.
చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఘంటసాలగారికి అభిమానులున్నారు. ఈ సినిమా పెద్ద స్థాయిలో జనాలకు చేరువవుతుంది. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. లీగల్ సమస్యల వల్ల సినిమా డిలే అయింది. ఇప్పుడు అలాంటి సమస్యలేమీ లేవు అని అన్నారు.
చిత్ర దర్శకుడు సిహెచ్ రామారావు మాట్లాడుతూ .. మహాగాయకులు అంటే అన్నమయ్య, రామదాసు, ఒక ఘంటసాల అని భావిస్తుంటారు. అన్నమయ్య, రామదాసులపై రాఘవేంద్రరావుగారు సినిమాలు తీశారు. మూడో వ్యకి ఘంటసాలగారిపై సినిమా తీసే అవకాశం నాకు దక్కింది. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఘంటసాలగా కృష్ణ చైతన్య కరెక్ట్‌గా సరిపోయాడని ఎస్‌పి బాలు గారు చెప్పారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం అని అన్నారు.
నటీనటులు: కృష్ణ చైతన్య, మృదుల, సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షిత్ మాస్టర్, జె.కె. భారవి, అశోక్ కుమార్, మాస్టర్ అతులిత్ (చిన్న ఘంటసాల), సాయి కిరణ్, అనంత్, గుండు సుదర్శన్, జి.వి.భాస్కర్, దీక్షితులు, జయవాణి తదితరులు
నిర్మాత: శ్రీమతి ఫణి
రచన, దర్శకత్వం: సీహెచ్ రామారావు
సహ నిర్మాత: జీవీ భాస్కర్
విజువల్ ఎఫెక్ట్స్: శ్యామ్ కుమార్ పి
సంగీతం: సాలూరి వాసూరావు
కెమెరా: వేణు మురళీధర్ వి
ఎడిటింగ్: క్రాంతి (RK),
ఆర్ట్: నాని,
సంగీతం: వాసూరావు సాలూరి,
నిర్మాణం: అన్యుక్త్ రామ్ పిక్చర్స్


Click it and Unblock the Notifications











