రవితేజకు జీహెచ్ఎంసీ అధికారుల షాక్.. హీరోకు కోట్లలో నష్టం.. వివాదం ఇదే!
గత కొద్దినెలలుగా టాలీవుడ్ సెలబ్రెటీలకు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు షాకుల మీద షాకులిస్తున్నారు. తొలుత అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సీనియర్ నటుడు మురళీ మోహన్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు ఇవ్వగా.. ఆయన తనకు తానుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరో స్టార్ హీరో రవితేజకు జీహెచ్ఎంసీ షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
స్వయంకృషితో ఎదిగిన రవితేజ
చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ ఎవరూ లేకపోయినప్పటికీ కేవలం తన కృషి, పట్టుదలతో తనకంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రయోగాలకు దూరంగా కేవలం కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు రవితేజ. ఈ హీరో నుంచి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అందులో విషయం ఉంటుంది. 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని నమ్మ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. గత కొద్దికాలంగా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నారు రవితేజ.

వరుస డిజాస్టర్లతో సతమతం
ధమాకా, వాల్తేర్ వీరయ్యల తర్వాత రవితేజ చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఎప్పుడూ చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండే రవితేజ.. ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. కెరీర్‌లో హిట్ కొట్టాల్సిన దశలో మాస్ జాతరపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రవితేజ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి రవితేజ
ప్రస్తుతం హీరోలు సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో దిగుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పలువురు సొంత థియేటర్ల కట్టేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ థియేటర్స్ పేరుతో తొలుత ఈ బిజినెస్‌లోకి రాగా, విజయ్ దేవరకొండ ఏవీడీ అనే మల్టీప్లెక్స్‌ను ఓపెన్ చేశారు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ పేరుతో సొంతంగా థియేటర్ కట్టారు. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ సహకారంతో హీరోలంతా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో అడుగుపెడుతున్నారు. తాజాగా రవితేజ కూడా ఏఆర్‌టీ అనే పేరుతో ఈ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం- ఎల్బీనగర్ ఏరియాలో ఈ మల్టీప్టెక్స్ నిర్మాణం ప్రారంభించారు. ఈ పనులు పూర్తయ్యాయని జూలైలో థియేటర్‌ను లాంఛనంగా ప్రారంభిస్తామని ఏషియన్ సునీల్ తెలిపారు.
రవితేజ మాల్‌కు నోటీసులు?
ఈ క్రమంలో రవితేజకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన మాంగల్య షాపింగ్ మాల్‌ను అధికారులు సీజ్ చేశారు. సరైన అనుమతి పత్రాలు లేకుండానే మాల్ ప్రారంభించినట్లుగా జీహెచ్ఎంసీ చెబుతోంది. ఈ భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లోనే రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మాణం జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ తాజా నిర్ణయంతో ఏఆర్‌టీ మల్టీప్లెక్స్ పనులు నిలిచిపోతాయా? లేదా? అన్నది చూడాలి. ఇది రవితేజకు చెందిన మరో థియేటరా? అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఏషియన్ సునీల్, రవితేజలు స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











