సెన్సార్ పూర్తి చేసుకున్న చాణక్య.. సైరాతో పోటీకి సై!
మ్యాచో స్టార్ గోపీచంద్ సినిమాలకు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే జయాపయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటాడు గోపీచంద్. కాకపోతే ఈ సారి మాత్రం ఏకంగా సైరా నరసింహా రెడ్డి సినిమాతో పోటీకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా 'చాణక్య'. యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు. దేశవిదేశాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. చాణక్య చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

చాణక్య చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడంలో అందె వేసిన చేయి తమిళ డైరెక్టర్ తిరుది. అతని స్టైల్ లోనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌గా వ్యవహరించారు.
అయితే ఓ వైపు అక్టోబర్ 2న విడుదలైన మెగా మూవీ సైరా నరసింహా రెడ్డి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే.. ఈ తరుణంలో అక్టోబర్ 5వ తేదీన చాణక్య ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. చూడాలి మరి గోపీచంద్ ఈ దసరాకు ఏ మేర ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడో!.


Click it and Unblock the Notifications











