తెరపైకి మరో రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర.. బయోపిక్‌పై చర్చలు!
వెండితెరపై బయోపిక్స్ అనేది సక్సెస్ ఫార్మూలా. సినీ రాజకీయ క్రీడా రంగాల్లో సేవలు చేసిన వారి జీవిత చరిత్రలు సిల్వర్ స్క్రీన్ మీద బాగానే ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎంతో మంది మహనీయుల జీవిత చరిత్రలు వెండితెరపై రాజ్యమేలాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. మహానటితో సావిత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు, యాత్ర పేరుతో వైఎస్సార్ జీవిత చరిత్రలు తెరపై ఆవిష్కరించారు.
ఇక మిగతా భాషల్లోనూ బయోపిక్‌ల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా జయలలిత మీద లెక్కలేనన్ని బయోపిక్స్ రెడీ అవుతున్నాయి. ఇది వరకే కొన్ని చిత్రాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరో రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర వెండితెరపైకి రాబోతోంది. ఈ మేరకు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని వ్యక్తి, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకి పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసిన వ్యక్తి గుమ్మడి నర్సయ్య.

సాదా సీదా జీవితం సాగిస్తున్న ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఒక బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది. గత ఆరు నెలలుగా ఈ కథకి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాని పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. మొత్తానికి ఇలా మరో బయోపిక్ తెలుగు తెరపై రాబోతోందన్న మాట. త్వరలోనే మిగతా వివరాలు బయటకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











