హిరణ్య కశ్యపని అందుకే వదిలేశా... త్రివిక్రమ్ జోక్యంపై గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సుకుమార్. బాల రామాయణం నుంచి మొదలుపెట్టి ఒక్కడు, సైనికుడు, అర్జున్, రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ బడ్జెట్ సినిమాలతో హల్‌చల్ చేశారు గుణశేఖర్. అయితే వరుస ఫ్లాపులతో ఆయన రేసులో వెనుకబడ్డారు. లాంగ్ గ్యాప్ తర్వాత గుణశేఖర్ తీసిన యుఫోరియా మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ? ఎవరితో సినిమా చేయనున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో గుణశేఖర్ అనౌన్స్ చేసిన హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ ఏమైంది? అనే చర్చ మొదలైంది. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
హిరణ్య కశ్యప అనేది టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, గుణశేఖర్‌ల డ్రీమ్ ప్రాజెక్ట్. హిందూ పురాణాల ఆధారంగా గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేయాలని స్క్రిప్ట్, ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. హిరణ్య కశ్యపుడిగా రానా దగ్గుబాటి టైటిల్ రోల్ పోషిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. గుణశేఖర్ ఎందుకు తప్పుకున్నాడు? త్రివిక్రమ్ మధ్యలో ఎందుకొచ్చారు? అనే దానిపై తాజాగా గుణశేఖర్ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

హిరణ్య కశ్యప ఇప్పట్లో లేనట్లే. రానా, నేను కలిసే స్టార్ట్ చేశాం. కర్ణుడి చావుకి బోలెడు కారణాలు అన్నట్లుగా మొత్తం అయిపోయింది. నా ఫిల్మోగ్రఫిలో ఏడెనిమిది సంవత్సరాలు ఒక్క సినిమా కూడా కనిపించలేదు. కానీ ఆ టైంలో నేను చాలా నేర్చుకున్నాను. మేం ఒప్పందం చేసుకుంది ఇంటర్నేషనల్ రేంజ్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో.. వాళ్లతో ఇంటర్నేషనల్ పైప్‌లైన్ ఫాలో అయ్యాం. సినిమా చేయడం గురించి తర్వాత.. ముందు సినిమా ఏం చేయబోతున్నావు? ఎలా తీయబోతున్నావు? చెప్పమని ప్రీ ప్రొడక్షన్ టైం లైన్ ఇవ్వమన్నారు. ఆ టైంలో నేను కూడా చాలా బిజీగా ఉన్నాను. ఎవరితోనూ కూర్చోనేంత తీరిక లేదని గుణశేఖర్ అన్నారు.
ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని చాలా అగ్రెసివ్‌గా చేశాం. కానీ ఆ టైంలోనే సరిగ్గా కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఫాక్స్ స్టార్‌ని డిస్నీ కొనేసింది. ఈ పెద్ద కంపెనీ వెళ్లి డిస్నీలో మెర్జ్ అయిపోయింది. ఈ మెర్జ్ అయ్యే ప్రాసెస్‌లో నా ప్రాజెక్ట్‌ని ఓకే చేసిన డైరెక్టర్స్ మారిపోయారు. ఇప్పుడున్న వారు రానా మీద, నా మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ రోజుల్లోనే 300 కోట్ల బడ్జెట్‌తో హిరణ్య కశ్యప అనుకున్నాం. అప్పటికే బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది. దాని దెబ్బతో వాళ్లు కూడా వెనకడుగు వేశారు. ఆ వెంటనే మేం కూడా బయటికొచ్చేశాం. రానా కూడా ఏదో రకంగా ట్రై చేయాలని చూశాడు, నేను కూడా ట్రై చేశాను. అదంతా ఈజీ కాదు. హిరణ్య కశ్యప ప్రాజెక్ట్‌కి ఒక పొటెన్షియల్ ఉంది. దానిని మనం క్యాచ్ చేయాలి.
ఎందుకంటే పురాణాలు.. మనం అనుకున్న కథని పది మంది ట్రై చేయొచ్చు, దానికి రైట్స్ అంటూ ఉండవు. అలా నేను భయపడినట్లుగానే మహావతార్ నరసింహా వచ్చి 600 కోట్లు కలెక్ట్ చేసింది. అది త్రీడి యానిమేషన్ సినిమా.. దాని బలమెంటో నేను ముందే ఊహించా. ఫాక్స్ స్టార్ వాళ్లు కూడా నా విజువలైజేషన్ చూసి ఇదంతా నిజంగా జరిగిందా? అని అడిగారు. నేను డిజైన్ చేసిన అష్టదిక్పాలకుల విధానం ముందు అవైంజర్స్ ఎందుకు పనికిరాదు. దానిని వాళ్లు గమనించారు.. అప్పుడు నా టైం కలిసి రాలేదు, యానిమేషన్‌లోనే 600 కోట్లు కలెక్ట్ చేసింది. నేను నమ్మింది మాత్రం ప్రూవ్ అయ్యిందని గుణశేఖర్ వెల్లడించారు.
అయితే మిమ్మల్ని కాదని వేరే డైరెక్టర్‌ని అనౌన్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి గుణశేఖర్ స్పందించారు. డైరెక్టర్ పేరు ప్రకటించలేదు.. కానీ త్రివిక్రమ్ గారి పేరొచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రానా, నేను ఈ హిరణ్య కశ్యప అనుకున్నప్పుడు త్రివిక్రమ్ గారు ఆయనంతటే ఆయనే ఫోన్ చేసి మాటలు రాస్తానని చెప్పారు. త్రివిక్రమ్ గారు మాటలు రాస్తే తిరుగులేదని రానా అనడంతో మేం వెంటనే ఒప్పుకున్నాం. కానీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో నేను బయటికి వచ్చేశా.. రానా వేరే ప్రాజెక్ట్‌ల్లో పడ్డాడు. ఒకానొక సందర్భంలో త్రివిక్రమ్‌ని రైటర్‌గా కంటిన్యూ చేస్తూ ఆ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆ సమయంలో మిస్ కమ్యూనికేషన్ జరిగింది.
ఏం తీయాలనుకుంటున్నానో విజువలైజేషన్‌లో చూపించేశా. దానిని ఫాలో అవుతూ వాడుకుంటున్నారా అనుకుని నేను హర్ట్ అయ్యాను. ఈ వార్తలు బయటకు రావడంతో త్రివిక్రమ్ గారు నాకు ఫోన్ చేసి నేను డైరెక్ట్ చేసే ఉద్దేశం లేదు, రైటర్‌గానే ఉంటా.. మీరే డైరెక్టర్‌గా ఉంటారని రానా నాతో అన్నారు, తీస్తే మీరే తీయాలని స్వయంగా త్రివిక్రమ్ 20 నిమిషాలు మాట్లాడారు. ఎవరూ తీసినా నాకు అభ్యంతరం లేదు.. కానీ నా విజువలైజేషన్ కాకూడదు. మహావతార్ నరసింహాను మించిన క్వాలిటీతో ఎపిసోడ్స్ తీశాను.. ప్రాజెక్ట్ కనుక వర్కవుట్ అయి రిలీజ్ అయ్యుంటే బాగుండేదని గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది.


Click it and Unblock the Notifications




