ఆ రోజు తేజ సజ్జాతో మూర్ఖంగా వ్యవహరించా.. ఇప్పుడైతే అరెస్ట్ చేసేవాళ్లన్న స్టార్ డైరెక్టర్..
టాలీవుడ్‌లో అరుదైన రికార్డు సాధించిన యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ప్రయాణం, బాలనటుడిగా మొదలై పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కథగా మారింది. ఈ క్రమంలో హనుమాన్, మిరాయ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తేజ సజ్జాను స్టార్ హీరోగా మార్చాయి. అయితే.. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కెరీర్ తొలి నాళ్లలో ఓ స్టార్ డైరెక్టర్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం. ఇంతకీ ఏం జరిగిందంటే.
మూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి పరిచయం
తేజ సజ్జా కేవలం మూడేళ్ల వయసులోనే 'చూడాలని ఉంది' సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. లెజెండ్ చిరంజీవి తో కలిసి నటించే అవకాశం తొలి సినిమాతోనే రావడం విశేషం. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవి కొడుకుగా తేజ నటించాడు. ముద్దు మాటలు, సహజమైన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఆ తర్వాత రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు, ఇంద్ర, గంగోత్రి, వసంతం, ఠాగూర్, బాలు వంటి అనేక సినిమాల్లో బాలనటుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ, జాంబిరెడ్డితో హీరోగా మారాడు. ఇష్క్, అద్భుతం వంటి సినిమాలతో తన ఇమేజ్‌ను బలపరుచుకున్నాడు. చివరికి హనుమాన్, మిరాయ్ తో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చి స్టార్ హీరోల సరసన నిలిచాడు.
'చూడాలని ఉంది' షూటింగ్‌లో ఏం జరిగింది?
ఇదిలా ఉండగా, ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో గుర్తుండిపోయే 'చూడాలని ఉంది' షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా బాల నటుడు తేజ సజ్జాతో చేసిన ఓ సన్నివేశం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
గుణశేఖర్ మాట్లాడుతూ.. 'ఆ సినిమాలో మాస్టర్ తేజ సజ్జను నిజంగానే స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరేశాం. ముందుగానే అందులో ఒక సమ్మర్‌ను సేఫ్టీ కోసం పెట్టాం. అయినా ఈ విషయం చెప్పగానే ఇంటర్వ్యూవర్ కూడా షాక్ అయ్యాడు. 'ఇది రియల్‌గా చేశారా?' అని అడిగాడు. అవును... అని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ సంఘటనను తలుచుకుంటే అది ఒక రకమైన తెలియనితనం, మూర్ఖత్వమే అని గుణశేఖర్ స్వయంగా అంగీకరించారు.
'ఆ సీన్ గురించి పిల్లవాడికి ముందుగా కూడా తెలియదు. అందుకే తేజ రియాక్షన్స్ చాలా నేచురల్‌గా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది చాలా ప్రమాదకరమైన పని. తేజ విషయంలో మేము కాస్త మూర్ఖంగానే వ్యవహరించామని చెప్పాలి' అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సన్నివేశాలు ఇప్పుడు అస్సలు తీయలేమని కూడా ఆయన అన్నారు. 'ఇప్పుడు అలా చేస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అది పూర్తిగా తెలియనితనంతో చేసిన పని' అంటూ వ్యాఖ్యానించారు.
గుణశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకవైపు అప్పటి సినిమా మేకింగ్ పరిస్థితులను గుర్తు చేస్తుండగా, మరోవైపు చిన్న వయసులోనే అలాంటి సన్నివేశాలు చేసిన తేజ సజ్జా ధైర్యాన్ని, సహజ నటనను ప్రశంసిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతున్న తేజ సజ్జా గురించి ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో, నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











