‘HanuMan హనుమాన్ రిలీజ్ ఆపడం అసాధ్యం.. ఏ మూవీ అడ్డొచ్చినా గట్టిగా ఢీకొడుతాం!’
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నది. ఎప్పటి మాదిరిగా కాకుండా 2024 జనవరిలో భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు తమ అదృష్ణాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 5 సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతుండగా.. స్క్రీన్ల కేటాయింపు విషయంలో టాలీవుడ్‌లో వివాదం కొనసాగుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
2024 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజ్ రవితేజ, మన్మథుడు నాగార్జున అక్కినేని నువ్వా నేనా అనే విధంగా పోటీకి తెరలేపారు. వారు నటించిన గుంటూరు కారం, సైంధవ, ఈగిల్, నా సామిరంగ సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలే కాకుండా మంచి కంటెంట్, హిందూ పురాణాల ఆధారంగా విజువల్, గ్రాఫిక్ టెక్నాలజీతో హనుమాన్ కూడా విడుదలకు రెడీ అవుతున్నది.

వాస్తవానికి హనుమాన్ సినిమా రిలీజ్ డేట్‌ను అందరికంటే ముందుగా ప్రకటించారు. దాంతోపాటు విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకొంటూ వస్తున్నారు. పోస్టర్లు, ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచారు. ఆ తర్వాత గుంటూరు కారం, సైంధవ, ఈగిల్, నా సామిరంగ సినిమాలు బరిలోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం హనుమాన్‌ను రిలీజ్ పోటీ నుంచి తప్పించేందుకు భారీ ప్లాన్ నడుస్తున్నదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

హనుమాన్ సినిమా రిలీజ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చిత్ర యూనిట్, నిర్మాత వెల్లడిస్తున్నారు. మా సినిమాను సైకిల్‌తో పోల్చినా.. ఎదురుగా కారు వచ్చినా.. బెంజ్ లారీ వచ్చినా ఎదురెళ్లి గుద్దేస్తాం. మా సినిమా ధాటికి ఏ సినిమా అయినా తుక్కు కావాల్సిందే అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీతో ఉన్నారు.

హనుమాన్ సినిమా ఓ స్పెషల్ ఫిల్మ్. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇండియా మొత్తం మాట్లాడుకొంటున్నది. ఈ సినిమా ఆడితే తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆడితే.. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. కాబట్టి ఎక్కువ స్క్రీన్లు మాకు ఇవ్వండి అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు.
హనుమాన్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది మా ఒక్కరి నిర్ణయం కాదు. ఈ రిలీజ్ విషయంలో చాలా మంది భాగస్వాములు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హిందీలో ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. బుక్ మై షో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. దాంతో మా సినిమా రిలీజ్ విషయంలో వెనుకకు వెళ్లే ప్రసక్తి లేదు అని ప్రశాంత్ వర్మ అన్నారు.


Click it and Unblock the Notifications











