250 కోట్ల బడ్జెట్ .. 3 సార్లు వాయిదాపడ్డ సినిమా.. వేణుస్వామితో హీరోయిన్ ప్రత్యేక పూజలు
ఎన్నో ఆశలు, అంచనాలతో తెరకెక్కించే సినిమాలను ప్రేక్షకుల దగ్గరికి చేర్చడమే ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారింది. రకరకాల కారణాలతో సినిమాలు వాయిదా పడటంతో దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. మేకర్స్ మాత్రమే కాకుండా ఆ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా తమ సినిమా ఏ ఆటంకాలు లేకుండా రిలీజ్ కావాలని అనుకుంటారు. అందుకే సినిమా రిలీజ్‌కి ముందు, వెనుకా తిరుమల సహా ప్రముఖ ఆలయాలను దర్శించడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా వేణుస్వామి
తెలుగునాట సెలబ్రెటీ జ్యోతిష్యుడుగా పాపులర్ అయిన వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రెటీల కెరీర్, వ్యక్తిగత జీవితాలపై జోస్యాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగచైతన్య- సమంతలు విడిపోతారని చెప్పి బాంబు పేల్చగా.. ఆ తర్వాత కొద్దిరోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో టాలీవుడ్‌లో వేణుస్వామి పేరు మారు మోగిపోయింది. నాటి నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వేణుస్వామి ఇంటి ముందు క్యూకట్టారు.

వేణుస్వామి ఇంటికి సెలబ్రెటీల క్యూ
సెలబ్రెటీ జ్యోతిష్యాలతో పాటు అస్సాంలోని కామాఖ్యలో ప్రత్యేక పూజలు, ఇంట్లో తాంత్రిక పూజలతో వేణుస్వామి మరింత ఫేమస్ అయ్యారు. ఆయన చేత పూజల చేయించుకున్న హీరోయిన్లు, ఇతర సెలబ్రెటీలు టాప్ పొజిషిన్‌కు వెళ్లడంతో వేణుస్వామిపై గురి బాగా కుదిరింది. అయితే ఏపీ, తెలంగాణ ఎన్నికలు, ప్రభాస్ ఆరోగ్యం, ఇండియా - పాకిస్తాన్ యుద్ధం తదితర విషయాలపై ఆయన జోస్యం రివర్స్ కావడంతో ట్రోలింగ్ జరిగింది. అయితే ఇటీవల ఆయన ఇంటికి తిరిగి సెలబ్రెటీలు క్యూకడుతున్నారు. మొన్నామధ్య బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.
వేణుస్వామి ఇంట్లో నిధి అగర్వాల్ పూజలు
తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ .. వేణుస్వామి ఇంట్లో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్ల క్రితం కూడా వేణుస్వామితో పూజలు చేయించారు నిధి. ఆమె కెరీర్ సజావుగా సాగడానికి, ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నిధి ఈ పూజలు చేయించినట్లుగా వార్తలు వచ్చాయి. హరిహర వీరమల్లు, రాజా సాబ్ సహా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఆ తర్వాతే ఆఫర్లు వచ్చాయని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్‌కు రెడీ అయ్యింది.
పలుమార్లు వాయిదాపడ్డ వీరమల్లు
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ.250 కోట్ల బడ్జెట్‌తో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యానిమల్ ఫేం, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఐదేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా అనేక ఆటంకాలను దాటుకుని చిత్రీకరణను పూర్తి చేసుకుంది. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎంతో కష్టపడి పూర్తి చేశారు. తొలుత హరిహర వీరమల్లును మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు షూటింగ్ పూర్తి కాకపోవడంతో మే 9కి, మళ్లీ జూన్ 12కి వాయిదా పడుతూ వచ్చింది. తీరా జూన్ 12న కూడా విడుదల వాయిదా పడి జూలై 24కి మారింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
కెరీర్ కోసమే నిధి అగర్వాల్ పూజలా?
ఈ నేపథ్యంలో వేణుస్వామి ఆధ్వర్యంలో నిధి అగర్వాల్ పూజలు జరిపించడం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి హరిహర వీరమల్లు సినిమాపైనే నిధి అగర్వాల్ ఆశలు పెట్టుకున్నారు. పవన్ అందుబాటులో లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలను తానై నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరమల్లుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, తన కెరీర్ బాగుండేందుకు గాను వేణుస్వామి ఆధ్వర్యంలో నిధి పూజలు చేయించుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేణుస్వామితో నిధి పూజలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











