RRR దారిలోనే హరిహర వీరమల్లు.. పవన్‌కు పాన్ ఇండియా వర్కవుట్ అవుతుందా?
ఏ ముహూర్తాన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టారో కానీ.. అన్ని ఇండస్ట్రీలు ఈ బాటలోనే నడవక తప్పని పరిస్ధితి. చిన్నా , పెద్ద తేడా లేకుండా హీరోలంతా పాన్ ఇండియా వెంట పరుగులు తీస్తున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నిఖిల్ వంటి స్టార్లు పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు. నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తుంటే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు.
అయితే అభిమానుల కోసం పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు పవన్ . ఆయన లేటెస్ట్ మూవీస్.. హరిహరవీరమల్లు, ఓజీలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయి. దీనిలో మొదట హరిహరవీరమల్లు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ ఈరోజు టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. ''హరిహరవీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ''గా రాబోతోంది.

పాన్ ఇండియా మార్కెట్‌లో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. అన్ని సినిమాలు ఈ టార్గెట్‌ను రీచ్ కాలేవు. ఎన్నో అంచనాలతో విడుదలై , బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ బొమ్మలు ఎన్నో. వివిధ భాషలు, సంస్కృతులు, అభిరుచులు, సెంటిమెంట్లు ఈ ఏరియాలో సవాళ్లు విసురుతుంటాయి. వాటిని అధిగమించి , ప్రేక్షకుడిని సంతృప్తిపరిచి , థియేటర్‌కు రప్పించడం దర్శక నిర్మాతలకు కత్తిమీద సాము వంటిదే. అందుకే చాలా పాన్ ఇండియా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి.
తాజా హరిహరవీరమల్లు విషయానికి వస్తే.. 17వ శతాబ్థంలో భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లనున్నారు మేకర్స్. ఇందులో పవన్ బందిపోటుగా కనపించనున్నారు. అంటే పీరియాడికల్ మూవీ. పూర్వకాలంలోకి తీసుకెళ్లి, ఆనాటి వాతావరణాన్ని క్రియేట్ చేసి తీస్తున్న సాంఘిక సినిమాలు లేటెస్ట్ ట్రెండ్. వీటిని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తుండటంతో మినిమమ్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ నానాటికి బలపడుతోంది. దశాబ్ధాల నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నేటి యువతలో ఉంటోంది. అదే చిత్రయూనిట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది.

రీసెంట్‌గా రిలీజైన ఆర్ఆర్ఆర్, రజాకార్, హీరామండి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమాలలో వున్న కామన్ పాయింట్ భారత స్వాతంత్ర్య ఉద్యమం. మన ఆర్ఆర్ఆర్‌నే తీసుకుంటే అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుంది. సహజంగానే దేశభక్తి , జాతీయవాదం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ. ఇది సూత్రాన్ని హరిహరవీరమల్లు ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం నాటి నవాబుల పాలన , నాటి పరిస్ధితులు, ప్రజల స్థితిగతులను ఈ సినిమాలో టచ్ చేసినట్లుగా టీజర్‌ను బట్టి చెప్పవచ్చు. మరి హరిహరవీరమల్లు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











