HariHara VeeraMallu: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. గెస్ట్‌లుగా ఎవరంటే?
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై చిత్రసీమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు, పవన్ కళ్యాణ్ గెటప్ దీనికి మరింత హైప్ తీసుకొచ్చింది. పలుమార్లు వాయిదా పడటంతో వీరమల్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు.
250 కోట్ల బడ్జెట్‌తో హరిహర వీరమల్లు
హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల మరణించిన లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావుకు ఇదే సినిమా కావడం గమనార్హం. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

వీరమల్లు షూటింగ్‌కు అడ్డంకులు
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు ఘనంగా షూటింగ్ ప్రారంభించుకుంది. ఈలోపు కరోనా మహమ్మారి దేశాన్ని వణికించడం, లాక్‌డౌన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ బిజీ కావడం, ఆపై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో హరిహర వీరమల్లు చిత్రీకరణ ఆలస్యమైంది. ఒకదశలో ప్రాజెక్ట్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అదే సమయంలో దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో పవన్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చివరికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకుని షూటింగ్ పరుగులు పెట్టించారు. పాలనపై పట్టు సాధించిన పవన్.. హరిహర వీరమల్లును షూటింగ్‌లో తరచుగా పాల్గొంటూ ఎట్టకేలకు సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. ఏకధాటిగా 4 గంటల పాటు డబ్బింగ్ చెప్పి తన బాధ్యతలను పూర్తి చేశారు.
యూ/ఏ సర్టిఫికేట్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హరిహర వీరమల్లుకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలని సీబీఎఫ్‌సీ తెలిపింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డ్ కూడా వీరమల్లు యూనిట్‌పై ప్రశంసలు కురిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? చీఫ్ గెస్ట్ ఎవరు? అంటూ డిస్కష్ చేస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే
గతంలో జూన్ 12న సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ముందుగా అనుకున్నట్లు తిరుపతిలోనే ఈవెంట్ జరుగుతుందని ఒకవేళ వర్షాలు ఉంటే విజయవాడలోని ఓ ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలు భావించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. జూలై 20న విశాఖపట్నం వేదికగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నట్లుగా మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది.
చీఫ్ గెస్ట్ ఎవరు?
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మెగాస్టార్ చిరంజీవిలలో ఎవరో ఒకరు హాజరవుతారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరి పేర్లు తెరమీదకి వచ్చాయి. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు హాజరవుతారని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరిద్దరిని నిర్మాత ఏఎం రత్నం స్వయంగా కలిసి ఈవెంట్‌కు ఆహ్వానిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











