Pawan Kalyan: హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయాల్సింది.. కానీ,

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వదిలేసిన కొన్ని కథలు తర్వాత పెద్ద హిట్లుగా మారిన సంగతి అభిమానులకు తెలిసిందే. గతంలో ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి వంటి సినిమాలు ముందుగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి తర్వాత ఇతర హీరోల చేతుల్లోకి వెళ్లాయని అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు అదే జాబితాలో మరో సినిమా కూడా ఉందని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా వెల్లడించారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో హరీష్ శంకర్ వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌తో తన తొలి భేటీ, అలాగే ఆయనకు చెప్పిన కథల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Harish Shankar Reveals Pawan Kalyan Rejected Mirapakay Story Before Ravi Teja Turned a Blockbuster

పవన్ కళ్యాణ్‌ను మొదటిసారి కలిసిన రోజు
హరీష్ శంకర్ చెప్పిన వివరాల ప్రకారం, పవన్ కళ్యాణ్‌ను తాను మొదటిసారి నిర్మాత బండ్ల గణేష్ సహాయంతో కలిశానని చెప్పారు. ఆ రోజు ఇప్పటికీ తనకు ఇంక గుర్తుందని అన్నారు. 'ఫార్మ్ హౌస్‌లో పవన్ కళ్యాణ్ గారు బ్లూ డెనిమ్ ప్యాంట్, షర్ట్‌లో కూర్చుని ఉన్నారు. ఆ యాంగిల్‌లో ఆయనను చూసినప్పుడు ఏ కథ చెప్పాలి అనే ఆలోచనలో పడ్డాను. నిజానికి నేను ఆయనకు సామాజిక సందేశం ఉండే మాస్ ఎలివేషన్ కథ చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అయ్యాను. కానీ ఆ సమయంలో ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ కథలు చేయాలని ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్పారు' అని హరీష్ శంకర్ వివరించారు.

దాంతో అప్పటికప్పుడు తన దగ్గర ఉన్న మరో కథను గుర్తు చేసుకుని కాసేపు బయటకు వెళ్లి ఆలోచించానని చెప్పారు. 'ఒక టీ కొట్టు దగ్గర రెండు కప్పుల కాఫీ తాగుతూ కథను మళ్లీ ఫ్రేమ్ చేసుకున్నాను. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాను' అని ఆయన తెలిపారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడిన విధానం ఇప్పటికీ గుర్తుందని హరీష్ శంకర్ చెప్పారు.

'మొదట నన్ను చూసి 'సారీ హరీష్... మీ సినిమా చూడలేకపోయాను. కానీ పాజిటివ్ టాక్ ఉందని విన్నాను' అని చెప్పారు. ఆ తర్వాత 'ఈరోజు నా మూడ్ బాగోలేదు. ఈరోజు కథ వినలేను. ఇంకోసారి వింటాను' అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే నా గుండెల్లో బండ పడినట్లు అనిపించింది,' అని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో నిర్మాత బండ్ల గణేష్ కూడా కాస్త టెన్షన్‌కు గురయ్యారని చెప్పారు.'మరోసారి అంటే ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. అప్పుడే కథ చెప్పాలి అని అనిపించింది. బండ్ల గణేష్ గారిని నేను అడిగాను... 'మీరు ఏదైనా చెప్పండి' అని. కానీ ఆయన మాత్రం 'నువ్వే వెళ్లి చెప్పు... ఆయన అర్థం చేసుకుంటారు' అని నన్ను ప్రోత్సహించారు," అని తెలిపారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి తాను చెప్పిన మాటలు కూడా హరీష్ శంకర్ వెల్లడించారు. 'సార్... నేను జాతకాలు, తిధులు చాలా నమ్ముతాను. చిన్నప్పటి నుంచి ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు రోజు చూసుకుంటాను. ఈరోజు ఏకాదశి... మంచి రోజు. చాలా ఎక్సైట్మెంట్‌తో వచ్చాను,'అని చెప్పానని ఆయన అన్నారు. అది విన్న వెంటనే పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆలోచన లేకుండా పక్కనే ఉన్న వారిని పిలిచి కుర్చీలు తెప్పించి కూర్చోబెట్టారని చెప్పారు. 'ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు ఎదుటివారి భావోద్వేగాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో నాకు అర్థమైంది' అని హరీష్ శంకర్ చెప్పారు.

'మీరు సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి కథను చిన్నగా చెప్పండి. పూర్తి కథను తర్వాత వింటాం' అని పవన్ కళ్యాణ్ చెప్పారని హరీష్ శంకర్ తెలిపారు. అలా మొదలైన కథ చెప్పడం తర్వాత గంట నలభై నిమిషాల పాటు ఆగకుండా సాగిందని చెప్పారు. 'నేను కథ మొదలు పెట్టాను... ఎలా ముగిసిందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆసక్తిగా విన్నారు. మధ్య మధ్యలో నవ్వుతూ ఎక్సైట్మెంట్ చూపించారు. దాంతో నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది' అని వివరించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం విన్న తర్వాత పవన్ కళ్యాణ్ 'కచ్చితంగా ఈ సినిమా చేద్దాం' అని మాట ఇచ్చారని హరీష్ శంకర్ తెలిపారు. ఆ కథే 'మిరపకాయ్' అయితే ఆ సమయంలో చెప్పిన కథే తర్వాత 'మిరపకాయ్' సినిమాగా మారిందని ఆయన వెల్లడించారు.

'మిరపకాయ్ కథను ముందుగా పవన్ కళ్యాణ్ గారికే చెప్పాను. ఆయన ఓకే కూడా అన్నారు. దాదాపు మూడు నెలలు ఆ కథతో ట్రావెల్ చేశాం. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేనని చెప్పారు,' అని హరీష్ శంకర్ అన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ 'తీన్మార్' సినిమా చేయడంతో మిరపకాయ్ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని చెప్పారు. దాంతో ఆ కథను హీరో 'రవితేజ'కు చెప్పి సినిమా చేశామని తెలిపారు. 2011 సంక్రాంతి సందర్భంగా విడుదలైన మిరపకాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అదే ఏడాది సమ్మర్‌లో వచ్చిన పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమా మాత్రం యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక ఆసక్తికర చర్చ చేస్తున్నారు. మిరపకాయ్ సినిమాను పవన్ కళ్యాణ్ చేసినట్లయితే ఆయన ఖాతాలో వరుసగా రెండు పెద్ద హిట్లు వచ్చేవని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తోంది. గబ్బర్ సింగ్ తరహాలో ఈ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. మార్చి 26న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X