జీవితకాలం ఆడే సినిమారా చిరంజీవి.. నువ్వు నా దేవుడివి అంటూ టాప్ డైరెక్టర్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేశారు. అలాగే చిరు నటిస్తోన్న విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ పేరుతో ఓ టీజర్, మెగా 157 సినిమా నుంచి టైటిల్‌ను రివీల్ చేసి మెగాస్టార్ అభిమానులకు పండగ తీసుకొచ్చారు. ఇక తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు చిరంజీవి. అయితే ఓ దర్శకుడు మాత్రం మెగాస్టార్‌కు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ ఫేస్ మార్చిన చిరు
కృషి, పట్టుదలతో హేమాహేమీలున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. నాలుగు దశాబ్ధాలుగా టాలీవుడ్‌ను మకుటం లేని రారాజుగా ఏలుతున్నారు చిరు. మూసలో కొట్టుకుపోతోన్న టాలీవుడ్‌కు కొత్త రక్తం ఎక్కించి.. ఫైట్స్, డ్యాన్సులు, డిఫరెంట్ మేనరిజంతో యువతను ఉర్రూతలూగించారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.

నాటి అభిమానులే.. నేడు దర్శకులు
చిరంజీవిని చూసి ఎందరో దర్శకులు, హీరోలు, టెక్నీషియన్లు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. నేడు దర్శకులుగా టాప్ ప్లేస్‌లో ఉన్నవాళ్లలో చాలామంది కాలేజ్ రోజుల్లో చిరంజీవి వీరాభిమానులే. ఆయన సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడటానికి చొక్కాలు చించుకుని, రక్తాలు చిందించినవాళ్లే. అందుకే తమ అభిమాన హీరోని.. ఎలా చూడాలని ఆశపడ్డారో వారంతా అలాగే చిరంజీవిని చూపిస్తున్నారు. దర్శకుడు బాబీ.. వాల్తేర్ వీరయ్యలో చిరంజీవిని వింటేజ్ లుక్‌లో ప్రజంట్ చేశారు. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడికి మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. శంకర వరప్రసాద్ గారు సినిమాతో పాత చిరంజీవిని బయటకు తీసుకొస్తున్నారు అనిల్.
శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా
తాజాగా మరో వీరాభిమానికి చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఆయనే శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో తనను తాను నిరూపించుకున్న శ్రీకాంత్.. మెగాస్టార్‌కు డైహార్డ్ ఫ్యాన్. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో ది ప్యారడైజ్ చేస్తున్న ఇతనికి .. తన తర్వాతి సినిమాగా మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. విశ్వంభర, మెగా 157, డైరెక్టర్ బాబీతో సినిమాలు పూర్తి చేసిన అనంతరం శ్రీకాంత్ ఓదెల- చిరంజీవి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
నువ్వు నా దేవుడివి
తన అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవికి శ్రీకాంత్ ఓదెల విషెస్ తెలియజేశారు. 'నువ్వు నా దేమి- గాడ్. చిరంజీవితో ఒక ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపెడితే.. ఫస్ట్ టైం నువ్వు ఫోటోలో నవ్వడం చూస్తున్నా రా అని చెప్పింది. నా దృష్టిలో చిరంజీవి అంటే అర్ధం ఇది. ఏం చేస్తాడు నీ చిరంజీవి అంటే.. నాలాంటి ఇంట్రావర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు. సినిమా టికెట్లు కొనుక్కునేవాడతో సినిమా తీయించగలడు.. నీ యమ్మా.. జీవితకాలం ఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు'.
నా చిరంజీవిని స్క్రీన్‌పై మరిచిపోయా
'ఫైనల్లీ.. నా చిరంజీవిని నేను స్క్రీన్ మీద మరిచిపోయా.. ఆయన్ను మళ్లీ బయటికి తీసుకొస్తానని మాటిస్తున్నా. నా కోసం నేనే తీసుకుంటున్న సినిమా ఇది. నా లాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా. చిరు ఓదెల.. ఇట్స్ బ్లడ్ ప్రామీస్. హ్యాపీ బర్త్ డే టీ రెక్స్ మెగాస్టార్ చిరంజీవి సార్. ఫోటో తీసేటప్పుడు హ్యాండ్ షివర్ అయి ఫోటో బ్లర్ వచ్చింది.. ఏమీ అనుకోవద్దు' అంటూ శ్రీకాంత్ ఓదెల ముగించారు. మొత్తానికి ఈరోజు చిరంజీవిని చాలా మంది విష్ చేశారు కానీ.. శ్రీకాంత్ ఓదెల పోస్ట్ మాత్రం మెగాభిమానులకు గూస్ బంప్స్ తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











