మార్కో మూవీపై నిషేధం.. ఉన్ని ముకుందన్ మూవీకి ఎదురు దెబ్బ!
మలయాళ చిత్ర పరిశ్రమ స్టామినాను మరోసారి చాటి చెప్పారు యువ హీరో ఉన్ని ముకుందన్. ఆయన హీరోగా నటించిన మార్కో చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాల చిత్రాల లిస్ట్‌లో టాప్ 10లో నిలిచింది. థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ దుమ్మురేపిన ఈ సినిమాకు అనుకోని కష్టం వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన మార్కోలో సిద్ధిఖ్, జగదీష్, అభిమన్యు తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సోన్ పౌల్‌లు కీలక పాత్రలు పోషించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై షరీఫ్ మొహమ్మద్ దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో మార్కోని తీశారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేశారు. డిఫరెంట్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతో మాస్‌ను ఒక ఊపిన మార్కో చిత్రం ఏకంగా రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

మలయాళంతో పాటు జనవరి 1న తెలుగులో విడుదలైన మార్కో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించి మంచి కలెక్షన్స్‌ని అందించింది. దీంతో మార్కోను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలలో అందుబాటులోకి వచ్చిన మార్క్ ఇక్కడా రికార్డ్ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే మితీమిరిన హింస, రక్తపాతంతో ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా మార్కోను నింపేశారంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే మార్కో అందించిన విజయంతో నిర్మాతలు షరీఫ్ మహ్మద్ ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
ఇలా అన్ని చోట్లా దూసుకెళ్తున్న మార్కోకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై బ్యాన్ విధించాలంటూ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. స్వయంగా సెన్సార్ బోర్డ్ అధికారే కేంద్రానికి లేఖ రాయడం సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమాను చూడటానికి పిల్లలను పంపించే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీబీఎఫ్‌సీ రీజనల్ అధికారి నదీమ్ తుఫాలి తెలిపారు. కుటుంబంతో కలిసి చూసే సినిమా కాకపోవడంతో దీని శాటిలైట్ ప్రసారాలపై ఇప్పటికే నిషేధం విధించామని.. అయితే ఓటీటీలో బ్యాన్ చేయడంపై తాజాగా ప్రభుత్వాన్ని కోరినట్లు నదీమ్ తెలిపారు.
అయితే ఈ సినిమాలో హింస, రక్తపాతంపై హీరో ఉన్ని ముకుందన్ ముందే స్పందించారు. తాము అనుకున్న స్క్రిప్ట్‌ను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా తీసుకొచ్చామని ఆయన తెలిపారు. మానవ జాతి పరిణామ క్రమంలో హింస భాగంగా ఉందని.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చిత్ర పరిశ్రమల్లోనూ హింస ఉందని ప్రేక్షకులు కూడా ఈ తరహా చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఉన్ని ముకుందన్ చెప్పారు. ప్రస్తుతం సీబీఎఫ్‌సీ అధికారి లేఖ రాయడంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











