Allu Arjun : ఉన్నపళంగా రావాలంటే ఎలా .. పోలీసులతో అల్లు అర్జున్ వాగ్వాదం
టాలీవుడ్ స్టార్ హీరో , ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ .. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ధ్రువీకరించారు.
సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే వివాహితక కుమార్తె మరణించగా.. ఆమె కుమారుడి పరిస్ధితి విషమంగా ఉంది. దీనిపై మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. తొక్కిసలాటపై అల్లు అర్జున్, అతని సిబ్బంది, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ ఆ ప్రాంతానికి వస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులను అదుపు చేసేలా ముందస్తు భద్రతను ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని వారు అంటున్నారు.

మరోవైపు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం అందిస్తామని, త్వరలోనే రేవతి ఫ్యామిలీని వ్యక్తిగతంగా కలుస్తానని అల్లు అర్జున్ తెలిపారు. పుష్ప 2 సక్సెస్ మీట్‌లోనూ ఆయన ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అటు పోలీసులు చట్టప్రకారం తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు.
ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో పోలీసుల తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా, కనీసం బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా అంటూ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పోలీసులతో రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అల్లు అర్జున్ తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన టైంలో బన్నీ కేవలం టీ షర్ట్, షాట్‌పై ఉన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు బెడ్‌రూమ్‌కి వెళ్లి డ్రెస్ మార్పించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.
సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న హెదరాబాద్ పోలీసులు#AlluArjun #AA #Arrest #Filmibeattelugu pic.twitter.com/EmBeplpKak
— TeluguFilmibeat (@TeluguFilmibeat) December 13, 2024
మరోవైపు.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడంతో ఆయన సతీమణి స్నేహారెడ్డి భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆమెను ఓదార్చి, ధైర్యం చెప్పారు బన్నీ. పోలీస్ వ్యాన్ ఎక్కేముందు భార్యను ముద్దాడి బయల్దేరారు. అటు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై కాసేపట్లో ధర్మాసనం విచారణ జరపనుంది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని బన్నీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటూ ఉండటంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











