బంగారు బాతును చంపేస్తారా? టికెట్ రేట్ల పెంపుపై అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. టికెట్ ధరల పెంపు కారణంగా సామాన్యుడికి వినోదం ఖరీదుగా మారిందని నాటి వైసీపీ సర్కార్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే టికెట్ రేట్లు తగ్గించాలని సినీ పరిశ్రమను , థియేటర్ల యాజమాన్యాలకు హుకుం జారీ చేసింది. తొలుత జగన్ ప్రభుత్వ నిర్ణయంపై సహజంగానే విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు 60 శాతం ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏపీలో .. అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులు నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలపై చర్చించారు.
జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన వారే కాదు.. ప్రశంసించిన వారూ లేకపోలేదు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కుటుంబంతో కలిసి ఏదైనా మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్లాలంటే టికెట్లకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. బండికి పెట్రోల్, పార్కింగ్ ఫీజులు, పాప్‌కార్న్ కూల్‌డ్రింక్స్‌కు మరో రూ.2000 వరకు చేతి చమురు వదిలించుకోవాల్సిందే. వీటన్నింటికీ భయపడిన సగటు జీవి .. ఓటీటీల రాకతో కాస్త లేటైనా పైన పేర్కొన్న వాటిలో సగం ఖర్చుతోనే ఏడాది మొత్తం హాయిగా ఇంట్లోనే సినిమాలు చూడొచ్చనే అభిప్రాయానికి వచ్చేశాడు.

ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు సినీ ప్రముఖులు టికెట్ రేట్లు తగ్గించి సినిమాను , థియేటర్‌ను బతికించాలని కోరారు. అసలే బడ్జెట్ లెక్కలు గతి తప్పి, తడిసి మోపెడవుతున్న వేళ ఈ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మెగా హీరో అల్లు శిరీష్ టికెట్ ధరలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన బడ్డీలో నటించారు శిరీష్. ఆగస్ట్ 2న బడ్డీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ.. నిర్మాతతో చర్చించి టికెట్ రేట్లు కూడా తగ్గించామన్నారు. టికెట్ ధరలు పెంచి ప్రేక్షకుల నుంచి డబ్బు సంపాదించేకన్నా.. ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించి, మరింత సంపాదించొచ్చన్నది తన సూత్రమని శిరీష్ వెల్లడించారు. భారతదేశంలో హిందీ మాట్లాడేవాళ్లు 90 కోట్ల మంది ఉన్నప్పటికీ .. థియటర్‌కు వచ్చి సినిమాలు చూసేవారి సంఖ్య నాలుగు కోట్లు మాత్రమే ఉంటుందని, అదే తెలుగు మాట్లాడేవాళ్లు 10 కోట్ల మంది ఉంటే.. థియేటర్లకు వచ్చే వారి సంఖ్య 3 కోట్ల పై మాటేనని తెలిపారు.
దీనిని బట్టి తెలుగువారు సినిమాను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్ధం చేసుకోవాలని.. బంగారు బాతుని చంపేసి తినకుండా ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే టికెట్ రేట్లను తగ్గించాలని శిరీష్ సూచించాడు. మా ప్రయత్నం సక్సెస్ అయితే మరింత మంది ఇదే బాటలో నడుస్తారని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం అల్లు శిరీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్లు బడ్డీకి మల్టీప్లెక్సుల్లో రూ.125.. సింగిల్ స్క్రీన్లలో రూ.99 చొప్పున టికెట్ రేట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











