Boycott Turkey టర్కీని బహిష్కరించండి.. పాకిస్థాన్‌కు మద్దతుపై నిఖిల్ ఆగ్రహం
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 9 ప్రాంతాల్లోని టెర్రర్ క్యాంప్‌పై మెరుపుదాడులకు దిగిన ఇండియన్ ఆర్మీ వాటిని నేలమట్టం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైతం భారత్‌లోని ఎయిర్‌బేస్‌లు, మిలటరీ స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసినా మన సైన్యం వాటిని గాల్లోనే పేల్చేసింది. ఈ పరిణామాలతో భారత్ - పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం ఆరంభమైనట్లేనని ప్రపంచం ఉలిక్కిపడింది.
భారత్ మహోగ్రరూపం
తమ యుద్ధం ఉగ్రవాదంపైనే అని తొలి నుంచి చెబుతున్న భారత్.. పాకిస్తాన్‌లోని టెర్రర్ క్యాంప్‌లపైనే టార్గెట్ చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలు, సాధారణ ప్రజల నివాస సముదాయాలను లక్ష్యంగా చేసుకోకుండా సంయమనంతో వ్యవహరించింది. తొలి రోజు ఉగ్రవాద స్థావరాలపై దాడితో సరిపెట్టిన భారత్.. మనదేశంలోని మిలటరీ స్థావరాలు, ఎయిర్‌బేస్‌లు, పౌర నివాసాలపై పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకోవడంతో రగిలిపోయింది. పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో మోహరించి ఉంచిన ఎయిర్ డిపెన్స్ సిస్టమ్స్, యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇండియాను రెచ్చగొట్టవద్దని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

శాంతి కోసం వెనక్కి తగ్గిన ఇండియా
భారత సైన్యం దెబ్బకు వణికిపోయిన పాకిస్తాన్ సాయం కోసం అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్ధించినా ఏ దేశమూ దానిని పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ - పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు, దక్షిణాసియాలో శాంతికి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో భారత్ వెనక్కి తగ్గింది. సాధారణ ప్రజలు బలి కావడం మంచిది కాదని మానవతా దృక్పథంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా దయ చూపించారు.
పాకిస్తాన్‌కు టర్కీ, అజర్‌బైజాన్ మద్ధతు
భారత్ కాల్పుల విరమణను తమ విజయంగా చెప్పుకుంటూ పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటోంది. అయితే అక్కడి ఎయిర్‌బేస్‌లకు కలిగిన నష్టం, యుద్ధ విమానాలను కూల్చిన వివరాలను భారత్ దాదాపు 70 దేశాలకు బ్రీఫింగ్ ఇచ్చింది. అయితే ఈ యుద్ధంతో ఎవరు మన శత్రువు, ఎవరు మనల్ని కష్టకాలంలో ఆదుకుంటున్నారో ఇండియాకు బాగా తెలిసొచ్చింది. ముఖ్యంగా టర్కీ, అజర్‌బైజాన్‌లు పాకిస్తాన్‌కు అండగా నిలవడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో టర్కీని భూకంపం కుదిపేస్తే స్పందించిన తొలి దేశం ఇండియానే. మానవతా దృక్పథంతో అవసరమైన సామాగ్రితో పాటు సిబ్బందిని సహాయక కార్యక్రమాల కోసం టర్కీకి భారత్ పంపించింది. కానీ చేసిన సాయం మరిచిపోయి మనపైనే విషం చిమ్మడంతో టర్కీపై కేంద్ర ప్రభుత్వంతో పాటు భారతీయులు భగ్గుమంటున్నారు.
#BoycottTurkey క్యాంపెయిన్
సోసల్ మీడియాలో #BoycottTurkey క్యాంపెయిన్ ఉద్ధృతంగా నడుస్తోంది. టర్కీతో పాటు అజర్ బైజాన్‌లలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్న భారతీయులు తమ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. వీరికి ప్రముఖులు కూడా మద్ధతు పలుకుతున్నారు. తాజాగా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ సైతం BoycottTurkeyకి మద్ధతు పలికారు. భారతీయులు పెద్ద ఎత్తున టర్కీకి వెళ్తుంటారని, మన వల్ల బిలియన్ల డాలర్ల మేర ఆదాయం ఆ దేశానికి వస్తుందని నిఖిల్ తెలిపారు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే దేశాల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఈ ట్వీట్‌ను ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











