Puri jagannadh: పూర్తిగా గెటప్ మార్చేసిన పూరీ జగన్నాథ్, షాక్‌లో నెటిజెన్లు, ఛార్మీ ఏమంటుందంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా 2000 సంవత్సరంలో బద్రి సినిమాతో కెరియర్ ప్రారంభించిన ఈయన అతి తక్కువ కాలంలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తాను తీసే చిత్రాల్లో అద్భుతమైన మార్కు చూపిస్తూ.. అందరినీ అలరించాడు. అలా అందరి స్టార్ హీరోలతో సినిమాలు తీసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి వారిని కూడా టాప్ హీరోలుగా నిలబెట్టాడు.
ముఖ్యంగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, 143, సూపర్, పోకిరి, దేశముదురు, హలో ప్రేమిస్తారా, చిరుత, బుజ్జిగాడు, నేనింతే, ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినేస్ మేన్, కెమెరా మాన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, లోఫర్, హార్ట్ ఎటాక్, టెంపర్ వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు తీశాడు. కానీ ఆ తర్వాత తీసిన అన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. జ్యోతిలక్ష్మి, పైసా వసూల్, రోగ్, మెహబూబా చిత్రాలు డిజాస్టర్లు కాగా.. ఇజం మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

వరుసగా చిత్రాలన్నీ ఫ్లాప్ అవడంతో ఫుల్ కసితో వచ్చిన పూరీ... రామ్ పోతినేని హీరోగా తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అయితే అదే ఊపుతో.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా తీశాడు. కానీ అది ఫెయిల్ అవ్వడంతో.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే ఇదంతా ఇలా ఉండగా.. పూరీ జగన్నాథ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తన లుక్ ను మార్చేశాడు. పూర్తిగా గెటప్ మార్చేసిన పూరీ గుండుతో కనిపించాడు. ఇటీవలే గుండు కొట్టించుకున్న ఆయన ఫొటోను.. హీరోయిన్ ఛార్మీ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో ఆయన చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ ఫొటోను షేర్ చేయడంతో పాటు పూరీని సూర్యుడితో పోలుస్తూ.. ఛార్మీ ఓ ట్యాగ్ లైన్ రాసుకొచ్చింది. వెన్ ద సన్ షైన్స్ అంటూ ఆయన ఫొటోను పెట్టింది. ఛార్మీ షేర్ చేసిన ఈ ఫొటోకు పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి.
ఏంటి సార్ లుక్ మొత్తం మార్చేశారు, ఈ గెటప్ లోనూ మీరు అదిరిపోయారు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మీరు చిరకాలం ఇలాగే నవ్వుతూ, అద్భుతమైన చిత్రాలు తీస్తూ.. మాకోసం కష్టపడాలంటూ ఓ నెటిజెన్ తన మనసులోని మాటను కామెంట్ రూపంలో వెల్లడించాడు. చూడాలి మరి రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో.


Click it and Unblock the Notifications











