'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సర్‌ప్రైజ్.. ఆ ఫొటోలు రిలీజ్.. అందుకోసం భారీ సెట్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)పై పవన్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను మరోసారి ఈ కాంబో రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ తెగ వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రెండు పార్టులుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు పవన్ కల్యాణ్. అలాగే వినోదయ సీతం రీమేక్ మూవీ బ్రో కూడా చేస్తున్నారు. ఇవే కాకుండా పవన్ కల్యాణ్ చేస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

11 ఏళ్ల క్రితం హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రెండోసారి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా అలాగే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమా ఉన్నట్లు ఇటీవల వదిలిన వీడియో గ్లింప్స్ ద్వారా అర్థమైంది. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ ను త్వరలో హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. అందుకోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీమ్ భారీ సెట్ ను నిర్మించారు.
హైదరాబాద్ లో నిర్మించిన భారీ సెట్ లో పవన్ కల్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందు వర్కింగ్ స్టిల్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో పవన్ కల్యాణ్ విభిన్న గెటప్పుల్లో కనిపించాడు. పోలీస్ యూనిఫామ్ తోపాటు మరికొన్ని స్టిల్స్ మనసు దోచుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ చర్చించడం కూడా చూడొచ్చు. "కొన్ని విషయాలు, కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు" అంటూ ఉన్న క్యాప్షన్ పవన్-హరీష్ శంకర్ బంధాన్ని చెబుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో గబ్బర్ సింగ్ కంటే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో బ్యూటిఫుల్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. అలాగే అశుతోష రానా, నవాబ్ షో, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శీను, నాగ మహేశ్, టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయనంక బోస్, ఎడిటర్ గా చోటా కే ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











