Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ .. అల్లు అర్జున్‌పై కేసు నమోదు , చిక్కుల్లో ఐకాన్‌స్టార్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మూడేళ్లుగా తమ అభిమాన హీరో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు పుష్ప 2 ఆకలి తీర్చేసింది. ఈ సక్సెస్ జోష్‌ని పుష్ప 2 యూనిట్ ఎంజాయ్ చేస్తుండగా.. ఓ న్యూస్ షాకిచ్చింది.
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల అవుతుండగా.. డిసెంబర్ 4నే ఓవర్సీస్ సహా భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్‌లలో ప్రీమియర్స్, స్పెషల్ షో, బెనిఫిట్ షోలు వేశారు. టికెట్ రేట్ ఎంతైనా సరే పెట్టి కొనేందుకు ఫ్యాన్స్ వెనుకాడలేదు. సాయంత్రం నుంచే థియేటర్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దీనిలో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియాలోని సంధ్య థియేటర్‌లోనూ స్పెషల్ షో వేశారు.
అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోగా.. కాసేపటికి అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూడగానే ఫ్యాన్స్ ఫోటోలు, సెల్ఫీలతో పాటు కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. దీంతో అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని పక్కకు నెట్టేసే క్రమంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. ఈ ఘటనలో వారికి ఊపిరి ఆడకపోవడంతో వెంటనే పోలీస్ సిబ్బంది వారిని బయటికి లాగారు.
రేవతి అపస్మారక స్థితిలో వెళ్లిపోగా .. ఆమె కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో అల్లు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ న్యాయవాద సంఘం నేత ఒకరు డిమాండ్ చేశారు. అలాగే తొక్కిసలాటపై అల్లు అర్జన్, సుకుమార్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్ అతని టీమ్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్న సమాచారాన్ని ముందుగా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్‌పైనా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. తమకు సమాచారం ఇవ్వకపోగా.. పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులను అదుపు చేసేలా భద్రతను ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని డీసీపీ అన్నారు. ఈ కేసు నేపథ్యంలో అల్లు అర్జున్ టీమ్, పుష్ప 2 యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











