హైకోర్టు ఏ స్టే ఇవ్వలేదు.. ఎన్ కన్వెన్షన్‌ని నేలమట్టం చేశాం , హైడ్రా కమీషనర్ క్లారిటీ
హైదరాబాద్ మాదాపూర్‌లోని సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మడికుంట చెరువును అక్రమించి నాగార్జున ఈ నిర్మాణం చేపట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా బృందం శనివారం ఈ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసింది. బుల్డోజర్లు, అధికారులు, భారీ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది హైడ్రా టీమ్.
మాదాపూర్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం తుమ్మడికుంట ప్రాంతంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ చాలా మందికి తెలిసిన స్పాట్. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన చాలా ఈవెంట్స్, పలువురి బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. అయితే చెరువును ఆక్రమించి నాగార్జున ఈ నిర్మాణం చేపట్టినట్లుగా ఎన్నోసార్లు అభియోగాలు రావడమే కాదు, కొందరైతే కోర్టుకు కూడా ఎక్కారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు, పర్యావరణవేత్తల నుంచి ఫిర్యాదులు అందాయి. అయితే నాగార్జున తన పలుకుబడిని ఉపయోగించి పలుమార్లు కూల్చివేతలను అడ్డుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి.

తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆక్రమణలను తొలగించి, కబ్జాదారుల భరతం పడతామని ఆ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఆ యంత్రాంగానికి స్వేచ్ఛను ఇవ్వడంతో రోజూ వార్తల్లో నిలుస్తోంది ఈ విభాగం. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాల్సిందిగా కొద్దిరోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఓ ఫిర్యాదు అందింది. దీనిని పరిశీలించిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడంతో హైడ్రా శనివారం నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసింది.
దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం స్టే విధించినట్లుగా వార్తలు వచ్చాయి. తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఎన్ కన్వెన్షన్ వ్యవహారంపై హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటన్నారు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 కుంటలు, బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 కుంటల్లో దీనిని నిర్మించారని రంగనాథ్ వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్‌కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవని, బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు.
చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని... కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడం అనేది పూర్తిగా అవాస్తవమని రంగనాథ్ పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని.. ఎఫ్‌టీఎల్‌లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశామని.. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని ఆయన వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తమవని తేలినట్లయ్యింది. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











