Allu Arjun: పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం.. తల్లీకూతుళ్లకు జీవితాంతం అలాంటి ఏర్పాట్లు
పేదరికంలో మగ్గుతూ.. తినడానికి తిండిలేక, అనారోగ్యంతో బాధపడుతూ ఎవరైనా సాయం చేయకపోతారా? అని ఎదురుచూస్తున్నారు సీనియర్ నటి పావలా శ్యామల. అనారోగ్యంతో ఉన్న కూతురికి వైద్యం చేయించలేక.. తన ఆరోగ్యం సరిలేక కష్టాలు పడుతున్నారు పావలా శ్యామల. ఆమె దుస్థితి గురించి తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు, దాతలు గతంలో సాయం చేశారు. అయినప్పటికీ వారి కష్టాలకు చెక్ పడలేదు. కొద్దిరోజులుగా ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ.. వారిని బయటకు పంపేయడంతో పావలా శ్యామల ఆమె కూతురు రోడ్డునపడ్డారు. ప్రస్తుతం ఓ ఫాండేషన్ వద్ద తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో పావలా శ్యామల కష్టాల గురించి తెలుసుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సాయం చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తీవ్ర ఇబ్బందుల్లో పావలా శ్యామల
నాటక రంగం నుంచి వచ్చి సినీరంగంలో స్థిరపడ్డారు పావలా శ్యామల. వందలాది చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రజల్ని కడుపుబ్బా నవ్వించారు. అయితే వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె సినీరంగానికి దూరమయ్యారు. తీవ్ర ఆర్ధిక సమస్యలతో, కనీసం తలదాచుకునేందుకు నిలువ నీడ లేక దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఆమె కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. తనకు ఇన్నేళ్లుగా ఆసరాగా ఉన్న కూతురు మంచానికే పరిమితం కావడం, తాను కూడా కదల్లేని స్థితికి చేరడంతో శ్యామల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పావలా శ్యామలను రక్షించిన పోలీసులు
ఇన్ని రోజులు ఆశ్రయం కల్పించిన ఓ కేర్ సెంటర్ వీరిని బయటకు పంపడంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా కథనాలు వచ్చాయి. రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరిని తిరుమలగిరి పోలీసులు రక్షించి ఆర్‌కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్చించారు. కొద్దిరోజుల క్రితం పావల శ్యామల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఎంతమంది ఆదుకున్నా మా కష్టాలు తీరవు.. చచ్చిపోదామనుకుని అనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లారిలేస్తే ఏమవుతుందో? నా బిడ్డ ఏమవుతుందోనని భయపడుతూనే ఉన్నా.. ప్రతిరోజూ ఇవాళ్టీతో నా జీవితం ముగిసిపోయినట్లేనని అనుకుంటా. నేను చనిపోతే.. నా బిడ్డ ఒంటరిది అయిపోతుందని ఇద్దరం చనిపోదామని అనుకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు పావలా శ్యామల.
పావలా శ్యామలకు సజ్జనార్ సాయం
ఇక న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ .. ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించి పావలా శ్యామలకు ఆర్ధిక సాయం అందించారు. కష్టకాలంలో శ్యామలను, ఆమె కూతురిని ఆదుకుని హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్పించిన తిరుమలగిరి ఏసీసీ రమేశ్‌ను సజ్జనార్ అభినందించారు. ఆ తర్వాత కూడా శ్యామల కన్నీటి గాథపై మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పావలా శ్యామల దుస్థితి గురించి తెలుసుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చలించిపోయారు. శ్యామలకు సాయం చేయాలని నిర్ణయించుకన్నారు బన్నీ.
శాశ్వత పరిష్కారం దిశగా అల్లు అర్జున్ ఆలోచన
అయితే ఇక్కడే అల్లు అర్జున్ అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించారు. ఒక్కసారి సాయం చేసి వదిలేయకుండా.. శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా పావలా శ్యామల, ఆమె కుమార్తెకు నిత్యావసరాలు, వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందేలా జీవితాంతం ఏర్పాట్లు చేశారు అల్లు అర్జున్. బుధవారం ఉదయం అల్లు అర్జున్ ప్రతినిధులు.. ఆర్కే ఫాండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న పావలా శ్యామల, ఆమె కుమార్తెను పరామర్శించి ఆర్ధిక సాయం గురించిన వివరాలు ఆమెకు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. అల్లు అర్జున్ పెద్ద మనసుపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











