చిరంజీవి సినిమాపై ఇళయరాజా కేసు ? అనిల్ రావిపూడి క్లారిటీ..
Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Varaprasad Garu). సంక్రాంతి కానుకగా విడుదలై ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ, చాలా గ్యాప్ తర్వాత చిరంజీవిని వింటేజ్ మాస్-కామెడీ అవతారంలో చూపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తొలి రోజే సుమారు రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ సక్సెస్ నేపథ్యంలో ఒక అంశం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అదే సినిమాలో వాడిన పాత పాటపై కాపీరైట్ వివాదం. చిరంజీవి- నయనతార మధ్య లవ్ ట్రాక్‌లో కీలకంగా వినిపించే 'సుందరి నువ్వే...'పాట, రజినీకాంత్- శోభన నటించిన దళపతి సినిమాలోని సూపర్ హిట్ సాంగ్. దీనికి సంగీతం అందించినది మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. ఇటీవలి కాలంలో ఇళయరాజా తన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అనుమతి లేకుండా వాడిన సినిమాలపై న్యాయపరంగా గట్టిగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. 'మంజుమ్మెల్ బాయ్స్', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి సినిమాలో కోర్టుకు వెళ్లి తనకు అనుకూలమైన తీర్పులు కూడా పొందారు. ఈ నేపథ్యంతో, 'మన శంకర వరప్రసాద్ గారు'లో 'సుందరి' పాటను వాడటంపై కూడా ఇళయరాజా కేసు వేస్తారా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి.

ఈ అంశంపై తాజాగా నిర్వహించిన 'మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్'లో అనిల్ రావిపూడిని విలేకరులు నేరుగా ప్రశ్నించారు. దీనికి ఆయన చాలా క్లియర్‌గా స్పందిస్తూ.. ఎలాంటి వివాదానికీ ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. 'మేము ఏ విషయాన్నీ ఇష్టారాజ్యంగా చేయలేదు. ఇళయరాజా గారి పాట వాడాలంటే తప్పనిసరిగా ఒక ప్రాసెస్ ఉంటుంది. మా నిర్మాతలు స్వయంగా ఆయనను కలిసి, చిరంజీవి గారి సినిమాలో ఈ పాటను వాడాలనుకుంటున్నామని చెప్పారు. అన్ని టెక్నికల్, లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాకే గ్రీన్ సిగ్నల్ వచ్చింది' అని అనిల్ రావిపూడి వివరించారు.
అంతేకాదు, 'ఇళయరాజా గారు ఎవరికీ వ్యతిరేకం కాదు. సరైన విధానంలో వెళ్లి అనుమతి తీసుకుంటే ఆయన చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. ఆయన పాటలను గౌరవంతో వాడితే ఎలాంటి సమస్య ఉండదు' అని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై కాపీరైట్ కేసు వస్తుందన్న ప్రచారానికి పూర్తిగా తెరపడింది.
సినిమాలో 'సుందరి' పాటను కేవలం పెట్టడం కోసం కాకుండా, చిరంజీవి- నయనతార మధ్య ప్రేమను మాటలకన్నా భావాలతో చెప్పేందుకు అనిల్ రావిపూడి వినియోగించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. సైగలతో సాగే లవ్ ట్రాక్‌కు ఈ పాట బలంగా నిలిచింది. మొత్తానికి.. ఇళయరాజా పాటల విషయంలో ఉండే టెన్షన్ ఈ సినిమాకు వర్తించదని, అన్ని అనుమతులతోనే 'సుందరి' సాంగ్‌ను ఉపయోగించామని అనిల్ రావిపూడి ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదం ముగిసినట్టే. ఇక బాక్సాఫీస్ వద్ద చిరంజీవి సినిమా దూసుకుపోతుండటంతో, మెగా ఫ్యాన్స్ డబుల్ సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











