MS Dhoni: పాకిస్థాన్ బౌలర్ జీవితాన్ని మార్చిన ఎంఎస్ ధోని.. ఆ సినిమాతోనే లైఫ్‌పై ఆశలకు చిగురు!
ఐసీసీ టీ 20 ఛాంపియన్స్ ట్రోఫీ -2026కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభమైన నాటి పలు వివాదాలకు కారణమైన.. యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. చివరి నిమిషం వరకు ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. బంగ్లాదేశ్‌కు మద్ధతుగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను పాక్ బహిష్కరించింది. అయితే ఐసీసీ, బీసీసీఐ దెబ్బకు పాక్ దిగిరాక తప్పలేదు. చివరి నిమిషంలో భారత్‌తో తాము మ్యాచ్ ఆడతామని యూటర్న్ తీసుకుని అంతర్జాతీయ సమాజం దృష్టిలో పరువు పొగొట్టుకుంది.
ట్రోఫీ ఎత్తుకుపోయిన పీసీబీ ఛైర్మన్
ఆపరేషన్ సింధూర్‌కు ముందు నుంచే భారత్ - పాకిస్తాన్‌ల మధ్య అన్ని రకాల సంబంధాలు తెగిపోయాయి. వీటిలో క్రికెట్ కూడా ఒకటి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లకు భారత ప్రభుత్వం అనుమతించడం లేదు. అటు బీసీసీఐ కూడా ఇందుకు సిద్ధంగా లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్‌లో.. అది కూడా తటస్థ వేదికల మీదే దాయాదుల మధ్య పోరు జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దిగజారాయి. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడినప్పటికీ ఆ జట్టు సభ్యులతో కరచాలనం చేసేందుకు భారత క్రికెటర్లు ససేమిరా అన్నారు. దీంతో ఫైనల్‌లో గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందించకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనను ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానులు మరిచిపోరు.

భారత్‌తో ఆడేందుకు పాక్ ఓకే
ఎన్ని వివాదాలు నడిచినా, ఎన్ని గొడవలు జరిగినా భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య ఐసీసీ మాత్రం మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు ఓకే గ్రూప్‌లో ఉన్నాయి. రేపు మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. భారత జట్టులో టాప్ స్టార్స్ ఉండగా.. పాకిస్తాన్ జట్టు గతంలో మాదిరిగా బలంగా లేదు. అయితే ఒక బౌలర్ మాత్రం దాయాది జట్టులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతనే ఉస్మాన్ తారీఖ్. తన మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు తారీఖ్.
మిస్టరీ బౌలర్‌గా ఉస్మాన్ తారీఖ్
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తారీఖ్ బౌలింగ్ యాక్షన్ గురించే. అతను బంతిని త్రో చేసినట్లు.. నేరుగా విసిరినట్లుగా ఉంటుంది.. దాంతో బ్యాటర్లు కన్‌ఫ్యూజ్ అవుతూ వికెట్లు సమర్పించుకుంటున్నారు. అతను బంతిని ఎలా విసురుతాడు.. ఏ దిశలో వేస్తాడు అర్ధంకాక బ్యాట్స్‌మెన్‌లు తలలు పట్టుకుంటున్నారు. భారత్‌తో మ్యాచ్‌లో తారీఖ్ తమ బ్రహ్మాస్త్రమని పాకిస్తాన్ చెబుతోంది. అయితే ఇతని బౌలింగ్ యాక్షన్‌పై పలుమార్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌కు ఫిర్యాదులు వచ్చాయి.
తారీఖ్ బౌలింగ్‌పై ఫిర్యాదులు
ఐసీసీ నిబంధనల ప్రకారం స్పిన్ బౌలర్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువ దూరం తీసుకెళ్లకూడదు.. అయితే తారీఖ్‌కు పుట్టుకతోనే కుడి చేయి నిర్మాణం సరిగా లేకపోవడంతో మినహాయింపు దక్కింది. వైద్యుల సిఫారసు మేరకు పీసీబీ మాత్రం తారీఖ్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపుప ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టి సత్తా చాటాడు. ఇప్పుడు ఐసీసీ టీ 20 ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతో తారీఖ్‌ను పీసీబీ ఎంపిక చేసింది. పీసీబీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెదర్లాండ్స్, యూఎస్ఏపై జట్టు విజయంలో తారీఖ్ కీలకపాత్ర పోషించాడు.
తారీఖ్ జీవితాన్ని మార్చిన ఎస్ఎంస్ ధోనీ
అయితే ఇప్పుడంతా అతనిని పొగుడుతున్నారు కానీ తారీఖ్ జీవితం కష్టాల మాయం. జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్న వేళ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవితకథ ఆధారంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కియారా అద్వానీ, భూమిక తదితరులు నటీనటులుగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ మూవీతో ప్రేరణ పొంది క్రికెట్‌లో అడుగుపెట్టినట్టు తారీఖ్ తెలిపారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చితో ఊగిపోయిన ఈ క్రికెటర్.. పాక్ జాతీయ జట్టులో అవకాశం కోసం ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయాడు.
సేల్స్‌మెన్ నుంచి క్రికెటర్‌గా
కుటుంబాన్ని పోషించడం కోసం దుబాయ్‌లో సేల్స్‌మెన్‌గా చేరాడు. తన జీవితం ఇక ఇంతేనా అని బతుకు బండిని లాగిస్తున్న దశలో ఎంఎస్ ధోనీ బయోపిక్ అతనిలో కొత్త ఆశలు రేపింది. తాడో పేడో తేల్చుకోవాలని ఉద్యోగాన్ని వదులుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్న తారీఖ్.. తన మిస్టరీ స్పిన్ బౌలింగ్‌తో దేశవాళీలో రాణించి.. సెలక్టర్ల దృష్టిలో పడి జాతీయ జట్టులో చేరడంతో పాటు ఏకంగా పాకిస్తాన్‌కు విజయాన్ని తీసుకొస్తాడని దేశప్రజలు నమ్మే స్థాయికి చేరుకున్నాడు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఎవరైనా? ఎలాంటి సామాన్యులైనా అత్యున్నత శిఖరాలను అధిరోహించొచ్చని తారీఖ్ నిరూపించాడు.


Click it and Unblock the Notifications











