మీ విజయంతో మా హృదయం ఉప్పొంగింది.. మహిళ క్రికెట్ జట్టుపై చిరంజీవి, రాజమౌళి, మహేష్ ప్రశంసలు
ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారతీయ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దశాబ్దాల కాలంగా ఊరిస్తున్న విజయాన్ని చేజిక్కించుకొన్న హర్మన్ ప్రీత్ జట్టు కప్ సాధించడమే కాకుండా మువ్వెన్నెల జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 246 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో చిరకాలంగా ఎదురు చూస్తున్న కప్ ఆడ సివంగిల వశమైంది.
భారత జట్టులో ఓపెనర్ షెఫాలీ శర్మ 87 పరుగులు, దీప్తి శర్మ 58 పరుగులు, స్మృతి మంథాన 45 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచారు. దీప్తి శర్మ ఆల్ రౌండ్ ప్రతిభ చూపి బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టగా, షెఫాలీ శర్మ 2 వికెట్లు చేజిక్కించుకొన్నారు. ఇలా భారత్‌కు దగ్గిన అపూర్వ విజయంపై సినీ ప్రముఖులు జేజేలు పలుకుతున్నారు. మహిళలు ఎగురవేసిన కీర్తి పతాకంపై రాజమౌళి, చిరంజీవి ఏమన్నారంటే?

భారతీయ మహిళల జట్టు విజయంపై రాజమౌళి స్పందిస్తూ.. ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్. మన భారతీయ మహిళల క్రికెట్ జట్టు కప్ సాధించి చూపించారు. దీప్తి శర్మ ఆల్ రౌండ్ ప్రతిభ, షెఫాలీ శర్మ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో విజయం సాకారమైంది. ఈ విజయంతో ప్రతీ భారతీయుడి హృదయం ఉప్పొంగింది అని ఆయన ట్వీట్ చేశారు.
భారతీయ క్రికెట్ రంగానికి చిరస్మరణీయమైన రోజు. మహిళల క్రికెట్ జట్టు దేశానికి గర్వంగా నిలిచారు. అద్బుతమైన విజయాన్ని సాధించిన భారతీయ మహిళల క్రికెట్ జట్టుకు కంగ్రాట్యులేషన్. ప్రతీ అమ్మాయి ధైర్యంగా కలలు కనే విధంగా ఈ విజయం స్పూర్తిగా నిలుస్తుంది. ప్రతీ తండ్రి, ప్రతీ క్రికెట్ అభిమాని ఆనందంలో మునిగిపోయేలా విజయం సాధించారు. ఇలానే మరిన్నీ సంచలన విజయాలు సాధించాలి. ఓటమి అడ్డుగోడలను ధ్వంసం చేయాలి. జై హింద్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసి అభినందించారు.
సౌతాఫ్రికాపై భారత మహిళల జట్టు సాధించిన విజయంతో నిజమైన అనుభూతిని పొందాను. చరిత్ర గర్వపడే విధంగా ఓ చాప్టర్‌ను లిఖించారు. త్రివర్ణ పతాకం ఎన్నడూ లేని విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ మహిళల క్రికెట్ జట్టు అద్బుతమైన ప్రతిభను, క్యారెక్టర్‌ను చాటింది. ఈ ఛాంపియన్లు భారత్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చారు అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేసి విజయాన్ని ఆస్వాదించారు.
వరల్డ్ కప్‌లో సంచలన విజయం సాధించిన టీమ్ ఇండియాకు కంగ్రాట్స్. భారత్‌కు తొలి మహిళల ప్రపంచ కప్‌ను అందించిన జట్టుకు అభినందనలు. దేశానికి నిజమైన విజయం, చారిత్రాత్మక గెలుపు అని ఇళయ దళపతి విజయ్ ట్వీట్ చేశారు.
భారతీయ మహిళల క్రికెట్ జట్టు బ్లూ రంగుతో చరిత్రను పెయింట్ చేశారు. పట్టుదల, ఐక్యత ఉంటే ఏదైనా సాధించవచ్చు అని భారతీయ మహిళల జట్టు ప్రపంచానికి చాటిచెప్పారు. కోట్లాది మందికి స్పూర్తిని అందించారు. దేశం మొత్తం గర్వపడే క్షణాలను అందించారు అని సూపర్ స్టార్ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.
ఉమెన్ ఇన్ బ్లూ అలియాస్ భారతీయ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్‌ను స్వదేశానికి తీసుకొచ్చారు. ఎక్స్రార్డినరీ టాలెంట్‌కు, పట్టుదలకు, ప్యాషన్‌తో మరుపురాని విజయాన్ని అందించారు. మైదానంలో ప్రతీ క్షణం ఛాంపియన్లుగా ఆడి తమ బలాన్ని, స్పూర్తిని చాటారు. దేశం మొత్తం గర్వపడేలా విజయాన్ని సాధించారు అని మనోజ్ మంచు ట్వీట్ చేశారు.
భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించడమే కాకుండా ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు. ఫైర్, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. విజయంతో గర్జించారు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించిన మీకు సెల్యూట్. విజయాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకొందాం అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











