బాలయ్య 105పై ఆసక్తికర అప్‌డేట్.. టైటిల్ ఫిక్స్ చేశారట
నందమూరి నటసింహం బాలకృష్ణ తదుపరి సినిమా అప్‌డేట్ కోసం ఆయన అభిమాన వర్గం ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కొద్దికాలం పాటు రాజకీయ పరమైన కార్యకలాపాలతో బిజీగా ఉన్న బాలయ్యబాబు ప్రస్తుతం ఫ్రీ కావడంతో అందరి కళ్లు ఆయన 105 సినిమాపైనే పడ్డాయి. నిన్న (జూన్ 10) ఆయన బర్త్ డే సందర్బంగా దీనికి సంబందించిన కీలక అప్‌డేట్ ప్రకటిస్తారని భావించారు ప్రేక్షకులు. అయితే అఫీషియల్ ప్రకటన రాలేదు గానీ బాలయ్య 105 టైటిల్ ఇదే అంటూ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.

కెఎస్ రవికుమార్‌తో బాలయ్య సినిమా
తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 105 రూపొందనుంది. ఈ చిత్రానికి బడా నిర్మాత సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అతిత్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుందని సమాచారం. కాగా తాజాగా కె.ఎస్.రవికుమార్, బాలయ్య కాంబోలో రాబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో ఫైనల్ డిసీజన్ తీసుకున్నారని తెలుస్తోంది.

స్క్రిప్ట్‌లో మార్పులు.. ఆసక్తికర టైటిల్‌తో
ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన మేర ఫలితం రాబట్టకపోవడంతో ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట బాలయ్య. ఈ మేరకు స్క్రిప్ట్ దగ్గరి నుంచి టైటిల్ వరకు అన్నీ ఆసక్తికరంగా ఉండాలని ఆయన అంటున్నారట. దీంతో ఇప్పటికే తయారు చేసిన స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసిన డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్.. తాజాగా చిత్ర టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. 'క్రాంతి' అనే టైటిల్‌ని ఆయన తన ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నారని టాక్.

టెంపర్ ఛాయలు
విభిన్న కథాంశంలో రానున్న ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని, ఆయన చేయనున్న ఈ క్యారెక్టర్ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని పోలి ఉంటుందని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా చిత్ర కథ కూడా టెంపర్ స్టోరీ లైన్‌కి కాస్త దగ్గరగా ఉంటుందని సమాచారం.

రూలర్ అనుకున్నారు గానీ చివరకు
బాలయ్య 105లో ఆయన క్యారెక్టరైజేషన్ పరంగా ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ టైటిల్ పై బాలయ్య అభిమానులు నిరాశగా ఉండటం డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దృష్టికి రావడంతో, ఆయన 'క్రాంతి' అనే టైటిల్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











