‘పవన్ కల్యాణ్ తోలు తీస్తాడు.. మైత్రీని తొక్కేసేందుకు దిల్ రాజుతో ఆ ఇద్దరు కుట్ర’
తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల మూసివేత వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో డిస్టిబ్యూటర్ అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జనసేన పార్టీకి దూరంగా పెట్టడం తొందరపాటు చర్య అంటూ ఆవేదన చెందారు. ఇటీవల దిల్ రాజు నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం, తనపై జనసేన పార్టీ తీసుకొన్న నిర్ణయం తర్వాత ఆయన తీవ్రంగా స్పందించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ థియేటర్ల వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన మీటింగ్‌లో డిస్టిబ్యూటర్లు థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారనే విషయంపై ఏపీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. థియేటర్లలో ఫుడ్, ఇతర సౌలభ్యాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్లకు తగిన విధంగా పన్ను కడుతున్నారా? ఏ మేరకు థియేటర్లలో వసతులు ఉన్నాయనే విషయంపై దృష్టిపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందులు దుర్గేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ లేదు అంటూ సినీ వర్గాలు ప్రకటించడంతో వివాదం ముగిసిందని అంతా భావించారు.

సినిమాల ప్రదర్శన విషయంలో వసూలైన కలెక్షన్లలో పర్సంటేజ్ విధానంపై తమకు కమిషన్ చెల్లించాలి. రెంట్ ప్రాతిపాదికన తమకు లాభం లేదు అనే అభిప్రాయం డిస్టిబ్యూటర్లు వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీన ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో పర్సంటేజ్ విధానంలో చెల్లింపులు లేకపోతే.. జూన్ 1వ తేదీ నుంచి మేము థియేటర్లు మూసివేస్తామని డిస్టిబ్యూటర్లు చెప్పారు. ఆ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను ఒకరిని కూడా కాదు అని దిల్ రాజు ఇటీవల ప్రకటించారు.
అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో థియేటర్లను బంద్ చేస్తామని డిస్టిబ్యూటర్ అత్తి సత్యనారాయణ నేతృత్వంలో తీర్మానించారనే విషయంపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. తమ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయనను పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. థియేటర్ బంద్ వ్యవహారంతో సంబంధం లేదని, ఈ వివాదంతో ఎలాంటి తన పాత్ర లేదని నిరూపించుకొనేంత వరకు పార్టీకి దూరంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించింది.

జనసేన పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయం వెలువడిన తర్వాత అందరి దృష్టి అత్తి సత్యనారాయణపైనే పడింది. ఈ వివాదానికి కారణం అతడే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన సమావేశంలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తామని ప్రకటన జారీ చేసిన దిల్ రాజును తీవ్రంగా దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ సినిమా జూన్ 12వ తేదీన వస్తుందని తెలిసి.. జూన్ 1వ తేదీన మీడియాలో న్యూస్ వచ్చింది. దానిని మీరు ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించాడు.
ఆంధ్రా డిస్టిబ్యూటర్లను అడ్డుపెట్టుకోని నైజాంలో పట్టు సాధించి నవాబుగా ఉండాలనుకొన్నావా? దానిని మేము ఒప్పుకోకపోవడంతోనే మమ్మల్ని టార్గెట్ చేశావు. ప్రజలంతా గమనిస్తున్నారు. మా నాయకుడికి నేను ఎలాంటి వాడినో తెలుసు. దిల్ రాజు ఎలాంటి వాడో తెలుసు. నీ స్వార్ధం యావత్ ప్రపంచానికి తెలుసు. అరవింద్ గారు నాకు 15 థియేటర్లు ఉన్నాయి. వాటిని రెన్యువల్ చేయించనని చెప్పారు. మీ ప్రెస్ మీట్‌లో ఏషియన్ సునీల్, సురేష్ బాబును ఎందుకు పక్కన పెట్టుకోలేదు. మీరంతా ఒకటే అని తెలుస్తుందనుకొన్నావా? అని అత్తి సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

ఇండస్ట్రీలో ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు ఒక్కటై చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. వారిని తొక్కడానికే మీరు ముగ్గురు ఏకమై పర్సంటేజీ విధానం పైకి తెచ్చింది. శత్రువులుగా ఉన్న ముగ్గురు ఒక్కటైంది అందుకే కదా.. ఈ విషయం అందరికి తెలియదా? మీరు అపర మేధావని అనుకొంటారు. దిల్ రాజ్ డ్రీమ్స్ అంటే నీ డ్రీమ్ ఇదేనా? నైజాంలో ఎవరిని రాకుండా తొక్కేసి.. ఆంధ్రాలో కూడా మమ్మల్ని ఏలేద్దామని అనుకొంటున్నావా? ఆంధ్రా డిస్డ్రిబ్యూషన్, ఎగ్జిబ్యూటర్ సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్పై మీరు, సురేష్ బాబు ఛాంబర్‌లో సంతకం పెట్టించారా? లేదా? ఆ లెటర్ నా వద్ద ఉంది అంటూ రుజువు చూపించారు.
థియేటర్ బంద్ అంశాన్ని నాపై వేయడం వేసి బురదజల్లడం సరికాదు. పవన్ కల్యాణ్ నా దేవుడు. అన్న విషయాలు గమనిస్తున్నాడు. అమాయకుడికి శిక్ష పడితే ఆయన ఊరుకోరు. తప్పు చేస్తే... దుర్మార్గంగా వ్యవహరిస్తే.. ఆయన తొక్కా తోలు తీస్తారు. జనసేన పార్టీలో మొదటి నుంచి ఉన్నాను. ఆయన సిద్దాంతాలకు అనుకూలంగా ఉన్నాను. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండటం బాధాకరం. అని అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ రాజు నా భవిష్యత్‌తో ఆడుకొన్నారు. నన్ను ఈ వివాదంలో బలి చేశారు. పార్టీ నుంచి బయటకు పంపించేలా చేశారు అని అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా ఆపే దమ్ము నాకే కాదు ఎవరికి లేదు అని అన్నారు.
సినిమాలు లేక థియేటర్లు మూతపడుతున్నాయి. వైజాగ్‌లో మీ మేనేజర్ శ్రీనివాస్ రావు చేస్తున్న అరాచకాలు అందరికి తెలుసు. ఎగ్జిబిటర్లను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలియదా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతోనే మీరు యూటర్న్ తీసుకొన్నారు. మీ తమ్ముడు శిరీష్ రెడ్డిని రక్షించుకొనేందుకు నన్ను బలి చేస్తావా? ఇండస్ట్రీలోని డిస్టిబ్యూషన్ రంగంలో ఆ నలుగురు అంటే.. దిల్ రాజు, శిరీష్ రెడ్డి, ఏషియన్ సునీల్, డీ సురేష్ బాబు అని సత్యనారాయణ అన్నారు.
ఇండస్ట్రీలో ఏవైనా సమస్యలు ఉంటే.. అందరూ కలిసి రండి. వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని పవన్ కల్యాణ్ చెబితే.. ఏనాడైనా చాంబర్ మీటింగ్‌లో చెప్పారా? మీరు పవన్ కల్యాణ్ కలిసిన తర్వాత ఆయన వెల్లడించిన వివరాలు ఎందుకు చెప్పలేదు. వాటిని ఎందుకు దాచిపెట్టారు. తమ సినిమాలు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయని అప్పుడు ఊసు ఎత్తకుండా.. ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయని మీరు ఇలా థియేటర్ బంద్‌కు పిలుపునిస్తారా? అని సత్యనారాయణ ప్రశ్నించాడు.


Click it and Unblock the Notifications











