మహేష్, అనిల్ రావిపూడి చిత్రం.. స్టార్ ప్రొడ్యూసర్ తప్పుకున్నారా!
మహర్షి చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. త్వరలో అనిల్, మహేష్ కాంబినేషన్ లోని చిత్రం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయ్యారు.
అనిల్ సుంకరతో ఓ చిత్రం చేయడానికి మహేష్ గతంలోనే కమిట్మెంట్ ఇచ్చారట. దీనితో మహేష్ అతడిని నిర్మాతగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. మహర్షి చిత్రం విడుదల తర్వాత మహేష్, అనిల్ రావిపూడి చిత్రం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి దిల్ రాజు సడెన్ గా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు ఎందుకు తప్పుకున్నారో కారణాలు తెలియలేదు.

ప్రస్తుతం మహర్షి చిత్రం విషయంలో కూడా దిల్ రాజు, అశ్విని దత్ మధ్య వివాదం నెలకొన్నట్లు రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని దేశభక్తి, కామెడీ ప్రధాన అంశాలుగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











