ఈ డైరెక్టర్స్ అంటే ఎన్టీఆర్‌కు ఎందుకంత భయం .. ఇండస్ట్రీలో వినిపించే మాటేంటీ..?
నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. నటన, ఆహార్యం, వాక్చాతుర్యం ఇలా అన్నింటిని తాత ఎన్టీఆర్ నుంచి పుణికి పుచ్చుకున్నారు జూనియర్. తాతయ్య ఒడిలోనే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకున్నారు.
అనంతరం చదువుపై దృష్టి పెట్టిన ఆయన .. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్న అందుకోకపోయినా.. పట్టుదలతో సినిమాలపై ఫోకస్ పెట్టిన ఎన్టీఆర్.. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆది సినిమాలతో బ్లాక్‌బస్టర్‌లను అందుకున్నారు. చిన్న వయసులోనే మాస్ ఫాలోయింగ్, స్టార్‌డమ్‌ను చూశారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంతో దేవర సిరీస్, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ -2లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లపై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో ఎన్టీఆర్ పేరు అంతర్జాతీయంగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయడమే కాదు.. యంగ్ జనరేషన్‌ను వెన్నుతట్టి ప్రొత్సహించడంలోనూ జూనియర్ ముందుంటారు.
ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలతో ఎస్ఎస్ రాజమౌళీ, వీవీ వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్స్ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అలాగే ఫ్లాప్స్‌లో ఉన్న దర్శకులకు కేవలం ప్రతిభను నమ్మి అవకాశమిచ్చి.. వారితో హిట్స్ కొట్టే హీరోగా ఎన్టీఆర్‌ను చెబుతుంటారు. ప్రతిభావంతులైన యువ దర్శకులను గుర్తించడంలోనూ ఆయనది అందెవేసిన చేయి... కానీ ఎందుకనో వారితో సినిమాలు తీయడానికి వెనుకడుగు వేస్తారన్న పేరూ ఉంది. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మతో సినిమా చేయాలని తారక్ భావించారు. అంతేకాదు.. అతను చెప్పిన కథ కూడా ఎన్టీఆర్‌కు నచ్చడం, కాంబినేషన్ సెట్ కావడం, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందన్న వార్తలూ వచ్చాయి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ఆ తర్వాత 2016లో వచ్చిన పెళ్లిచూపులు ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. విజయ్ దేవరకొండ , రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఆ వెంటనే ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా వంటి సినిమాలతోనూ తరుణ్ ఆకట్టుకున్నారు. ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఆయన ప్రయత్నించారట. వీరి మధ్య కథా చర్చలు కూడా జరగ్గా.. కాంబినేషన్ సెట్ అయినట్లు వార్తలు సైతం వైరల్ అయ్యాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి ఎక్కలేదు. అలాగే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యవ్‌తోనూ తారక్ ఓ సినిమా చేయాల్సి ఉండగా అది కూడా కార్యరూపం దాల్చలేదు.
ఈ ముగ్గురు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయకపోవడానికి కారణాలు ఏవైనా సరే ఓ విషయం గుర్తుంచుకోవాలి. తారక్ ఓ స్టార్ హీరో.. మాస్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. ఈ ముగ్గురు యువ దర్శకులు .. కమర్షియల్ డైరెక్టర్స్ కాదు, పైగా వీరు తమ మొదటి సినిమాలో ఎన్టీఆర్ వంటి బిగ్‌స్టార్‌ను టేకప్ చేయలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని, సరిగా హ్యాండిల్ చేయగలుగుతారా , ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు వంటి ఆలోచనలతో ఎన్టీఆర్ యువ దర్శకులతో సినిమాలు చేయడానికి కాస్త వెనకడుగు వేస్తుంటారని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











