Pushpa 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎఫెక్ట్.. అందుకే పుష్ప 2 వాయిదా పడిందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పుష్ప-1 దేశాన్ని ఊపేసింది. 1980-90 దశకాలలో చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పుష్పరాజ్ అనే డీగ్లామర్, మొరటు యువకుడి పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయారు. ఈ క్యారెక్టర్‌లో ఆయనను తప్పించి మరొకరిని ఊహించుకోలేమంటే బన్నీ ఎంతగా జీవించారో అర్ధం చేసుకోవచ్చు. శ్రీవల్లిగా రష్మిక.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, అజయ్ ఘోష్‌లు కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు.
2021 డిసెంబర్‌లో రిలీజైన పుష్ప రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్‌లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలో దిగి హిందీ జనాలను ఊపేసింది. దీంతో పుష్ప-2 కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, గ్లింప్స్, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న టైంలో చిత్రయూనిట్ షాకిచ్చింది. పుష్ప-2 విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది. పుష్ప-2ని మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నామని, చిత్రీకరణ ముగియకపోవడం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో ఉండటంతో అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.
అయితే పవన్ కళ్యాణ్‌కు, ఆయన అభిమానులకు భయపడే పుష్ప-2 రిలీజ్‌ను వాయిదా వేసినట్లుగా ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు కాకుండా ఆయన బద్ధ శత్రువు వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిల తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. పవన్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌లో అల్లు ఫ్యామిలీ లేదు. చివరికి ప్రమాణ స్వీకార సమయంలోనూ అల్లు అర్జున్ కనిపించలేదు. మంత్రిగా ప్రమాణం చేసిన తన మేనమామకు కనీసం సోషల్ మీడియా ద్వారానైనా విషెస్ చెప్పలేదు బన్నీ. ఇలాంటి దశలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్‌ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ పరిణామాలతో మెగా, పవన్ అభిమానులు బన్నీపై గుర్రుగా ఉన్నారు. గతంలో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ అన్న ఒక్క మాటతో ఆయన నటించిన ఓ సినిమాపై కసి తీర్చుకున్నారు అభిమానులు. పైగా సినీ పరిశ్రమను , తమ అభిమాన హీరోలను తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ దారుణంగా అవమానించారని మిగిలిన ఫ్యాన్స్ కసితో రగిలిపోతున్నారు. అలాంటిది అల్లు అర్జున్ .. వైసీపీ తరపున ప్రచారానికి వెళ్లడమేంటని ఆరోజునే ఇతర హీరోల అభిమానులు సైతం పెదవి విరిచారు. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లో పుష్ప-2ని దించితే అసలుకే మోసం వస్తుందని దర్శక నిర్మాతలు భావించే సినిమాను వాయిదా వేశారని గాసిప్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే షూటింగ్ పార్ట్‌తోపాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు మైత్రీ మూవీస్ మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు.


Click it and Unblock the Notifications











