RRR Vs Bheemla Nayak మళ్లీ రిలీజ్ డేట్ల వివాదం.. రాజమౌళికి నాగవంశీ కౌంటర్?
టాలీవుడ్‌లో భారీ చిత్రాల విడుదల తేదీల ప్రకటన రావడంతో మీడియా, సోషల్ మీడియాలో ఒక్కసారిగా హంగామా మొదలైంది. అయితే చిరంజీవి, రాంచరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, యష్, విజయ్, అజిత్, పవన్ కల్యాణ్ లాంటి అగ్రహీరోల సినిమాలు పోటాపోటీగా రిలీజ్ డేట్లు ప్రకటించడంతో టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. రెండు నెలల వ్యవధిలో 10కి పైగా చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం మొదలైంది. అయితే పవన్ కల్యాణ్, రాజమౌళి సినిమాల మధ్య మరోసారి ఆసక్తికరమైన పోటీకి తెరలేవనున్నదా? అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి బరి నుంచి భీమ్లా నాయక్‌ను తప్పించి..
RRR సినిమా విషయానికి వస్తే.. వాస్తవానికి జనవరి 7వ తేదీన రిలీజ్ కావాల్సింది. ఆ సమయంలో జనవరి 14వ తేదీన భీమ్లా నాయక్ కూడా పోటీలో ఉంది. అయితే RRR కోసం భీమ్లా నాయక్‌ను పట్టుబట్టి నిర్మాత దిల్ రాజు వాయిదా వేయించాడు. అయితే త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీకి ఈ సినిమాను వాయిదా వేయడం ససేమిరా ఇష్టం లేదనే విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి వేసిన ట్వీట్లు మీడియాలో అత్యంత వివాదాస్పదంగా మారాయి.

ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ వివాదం
సంక్రాంతి రిలీజ్ సినిమాల విడుదల విషయంలో తలెత్తిన గందరగోళాన్ని నివారించేందుకు మహేష్ బాబు మంచి నిర్ణయం, చొరవ తీసుకొన్నారు. సర్కారు వారి పాట వాస్తవానికి సంక్రాంతి సినిమా. కానీ RRR కోసం తన సినిమాను వేసవికి షిఫ్ట్ చేసి.. ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. అందుకు నా హీరోకు థ్యాంక్స్ అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఆ తర్వాత సంక్రాంతి పోటీ నుంచి భీమ్లా నాయక్ తప్పుకొన్న తర్వాత పవన్ కల్యాణ్, చిన్నబాబును ఉద్దేశించి సింపుల్‌గా రాజమౌళి ట్వీట్ చేస్తూ.. భీమ్లా నాయక్ రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నందుకు చిన్నబాబు, పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను. ఈ యూనిట్‌కు అంతా శుభం జరుగాలి అని ట్వీట్ చేశారు. అయితే మహేష్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ, పవన్ కల్యాణ్‌కు మామూలుగా ట్వీట్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడ్డారు.

మార్చి 25న RRR మూవీ
అయితే కరోనావైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో RRR యూనిట్ తమ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మార్చి 25వ తేదీన RRR ను రిలీజ్ చేస్తున్నాం. విడుదల తేదీని ఫైనలైజ్ చేశాం అంటూ జనవరి 31న (సోమవారం) అధికారికంగా ప్రకటించారు. అయితే RRR ప్రకటన వెలువడిన వెంటనే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్‌ను కూడా నిర్మాతలు చినబాబు, నాగవంశీ ప్రకటించారు.

భీమ్లా నాయక్‌కు రెండు డేట్లతో వివాదం
భీమ్లా నాయక్ రిలీజ్ డేట్‌ను సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటిస్తూ.. ముందుగా ప్రకటించిన విధంగానే భీమ్లా నాయక్ సినిమా మాస్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్. కరోనావైరస్ తగ్గుముఖం పట్టే వరకు ఆలోచించి.. థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాం. మా సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన కానీ, లేదా ఏప్రిల్ 1వ తేదీన కాని రిలీజ్ చేస్తాం. కరోనావైరస్ పరిస్థితిని బట్టి ఏ డేట్ వీలైతే ఆ డేట్‌ను చూసుకొని సినిమాను రిలీజ్ చేస్తాం అని ప్రకటించింది.

వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వార్
అయితే RRR మార్చి 25న రిలీజైతే.. మరో వారం రోజుల్లోగా అంటే ఏప్రిల్ 1వ తేదీన భీమ్లా నాయక్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. అయితే అదే జరిగితే.. RRR సినిమాపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 25న కాకుండా భీమ్లా నాయక్ ఏప్రిల్ 1న రిలీజ్ అయితే ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు, థియేటర్ల విషయంలో తేడా కనిపించే అవకాశం ఉంది. ఈ రెండు సినిమా డేట్లు ప్రకటించిన తర్వాత ఇప్పుడు RRRతో అమీ తుమీ తేల్చుకొనేందుకు నిర్మాత నాగవంశీ సిద్దమవుతున్నాడా అనే చర్చ ఇండస్ట్రీలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











