వరల్డ్ వైడ్ 2 కోట్ల కలెక్షన్లు.. వాడికి 13 కోట్ల రెమ్యునరేషనా? హీరోపై డిస్టిబ్యూటర్ ఘాటుగా!
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వివాదం దాదాపు సద్దుమణిగినట్టే కనిపించినా.. తాజాగా శనివారం (జూన్ 7వ తేదీన) నిర్వహించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సమావేశం మరో వివాదానికి తెర లేపింది. ఈ సమావేశంలో నిర్మాత, డిస్టిబ్యూటర్ సునీల్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ శ్రీధర్ తదితరులు మాట్లాడారు. మీడియాకు తమ కమిటీ వివరాలను వెల్లడిస్తూ తెలంగాణలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ యువ హీరోపై పరోక్షంగా చేసిన కామెంట్లు అత్యంత చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో థియేటర్లను మూసివేస్తున్నామని అటు తెలుగు ఫిలిం ఛాంబర్‌కు గానీ, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు గానీ ఎలాంటి లెటర్ ఇవ్వలేదు. కేవలం ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేస్తే.. ఇక్కడ నుంచి ఆంధ్రాకు వెళ్లిపోయింది. అయితే పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు వస్తుందని థియేటర్లన్నీ ఖాళీ పెట్టుకొన్నాం. కానీ ఆ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ నెల అంతా మాకు ఆదాయం కోల్పోయినట్టే అని ఆయన అన్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ 2, కోర్టు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందుకు సింగిల్ థియేటర్ ఓనర్లను బద్‌నాం చేస్తున్నారు. హీరోలకు స్టార్ డమ్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఒక్కో హీరో 2 నుంచి మూడు సినిమాలు చేస్తుండేది. ఇప్పుడు రెండేళ్లకు ఒక సినిమా తీస్తున్నారు. 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకొనే వాళ్లకు 30 లక్షలు వరకు పెంచారు అని నిర్మాతలపై శ్రీధర్ మండిపడ్డారు.
టాలీవుడ్‌లో ఓ హీరో నటించిన సినిమా వరల్డ్ వైడ్ 2 కోట్ల రూపాయల షేర్ రాలేదు. వాడిని పిలిచి 13 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్కడికి పోతున్నది. ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఎవరు? మేము థియేటర్లను బంద్ చేస్తున్నామని ఎవ్వరికి లెటర్ ఇవ్వలేదు. బంద్ అని చెప్పలేదు అని శ్రీధర్ ఘాటుగా విమర్శలు చేయడం ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీసింది.
అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు యువ హీరో సిద్దు జొన్నలగడ్డ ఉద్దేశించినవే అని మీడియాలో చర్చ జరుగుతున్నది. ఆ హీరోను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? చాలా మంది హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. వారి ఊసు ఎత్తకుండా సిద్దూపైనే పరోక్షంగా కామెంట్ చేయడం ఏమిటనే పశ్న భారీ చర్చకు దారి తీసింది.
ఇక సిద్దూ జొన్నల గడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సుమారుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కేవలం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్టాల్లో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, సుమారు 3 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసినందున తన రెమ్యునరేషన్ నుంచి 4.75 కోట్ల రూపాయలు నిర్మాతకు వెనక్కి ఇచ్చేశాడనే వార్త మీడియాలో హైలెట్ అయింది. తాజాగా శ్రీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











