Drugs Case టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు యువ హీరోలు.. కీలకంగా మారిన సిక్కిరెడ్డి ఎవరంటే!
టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో కబాలి తెలుగు వెర్షన్ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరీ అలియాస్ కేపీ చౌదరీ అరెస్ట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ వ్యవహారంలో ఊహించని పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అషురెడ్డి, సురేఖవాణి, జ్యోతి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు బయటకు రావడం, అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించిన మరికొన్ని పేర్లు కూడా వినిపించడం సెన్సేషనల్‌గా మారింది. ఆ పేర్ల వివరాల్లోకి వెళితే..
కేపీ చౌదరీ డ్రగ్స్ కేసు వ్యవహారం బాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి ఫ్లాట్ చుట్టు తిరుగుతున్నది. సిక్కిరెడ్డి ఇంట్లోనే భారీగా పార్టీ జరిగిందని, ఆ పార్టీలోనే భారీగా కొకైన్, డ్రగ్స్ ఉపయోగించారనే విషయం చర్చనీయాంశమైంది. అయితే సిక్కిరెడ్డి ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సిక్కిరెడ్డి భర్త మీడియా ముందుకు వచ్చి స్పందించాడు.

డ్రగ్స్ వ్యవహారంలో సిక్కిరెడ్డి భర్త స్పందిస్తూ.. కేపీ చౌదరీతో మాకు పరిచయం ఉంది. కానీ మా ఫ్లాట్‌లో జరిగిన పార్టీతో మాకు సంబంధం లేదు. మేము క్రీడాకారులం. ఉదయమే లేచి ప్రాక్టీస్‌కు వెళ్తాం. అర్ధరాత్రి పార్టీలకు మాకు సంబంధం లేదు. కేపీ రెడ్డి గోవాలో నిర్వహించిన పార్టీల గురించి కూడా మాకు తెలియదు అని అన్నారు.
కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో భాగంగా పోలీసులు జరిపిన విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. కేపీ చౌదరీ గూగుల్ డ్రైవ్‌లో 9 వేలకుపైగా ఫోటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 9 వేల ఫోటోలలో కొందరు హీరోలు, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖుల ఫోటోలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో ప్రముఖంగా ఇద్దరు యువ హీరోల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరోల పేర్లు బయట పెట్టకపోవడం వెనుక రాజకీయ నేతలు ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ కేసులో ఇద్దరు హీరోలు తమ పేర్లు బయటకు రాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ కేసు విచారణలో తన పేరు బయటకు రావడంతో బిగ్‌బాస్ ఫేమ్ సినీ నటి అషురెడ్డి స్పందించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు. కేపీ చౌదరీ నిర్మాతగానే నాకు తెలుసు. ఆయనతో రెండుసార్లు మాత్రమే కలిశాను. అంతకంటే ఏమీ సంబంధం లేదు. డ్రగ్స్ పార్టీలకు వెళ్లలేదు అని అషురెడ్డి అన్నారు.


Click it and Unblock the Notifications











