విక్రమార్కుడు సీక్వెల్ రెడీ.. రాజమౌళి దర్శకుడు కాదంట? డైరెక్టర్ ఎవరనేది చెప్పిన నిర్మాత!
Raviteja : రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'విక్రమార్కుడు'. ఈ సినిమాలో రవితేజ.. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ రాథోడ్‌గా రెండు డిఫరెంట్ పాత్రలను పోషించారు అని చెప్పడంకంటే జీవించారు అనే చెప్పాలి. ఈ సినిమా పై రవితేజ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ప్రత్యేక అభిమానం ఉంటుంది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సీక్వెల్ వివరాల్లోకి వెళితే..
ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విక్రమార్కుడు సినిమా హిందీ, కన్నడ, దాదాపు అన్ని భాషల్లో రూపొందించారు. కానీ ఏ భాషలోనూ రవితేజ చేసినట్టు పెర్ఫార్మెన్స్ మరో హీరో చేయలేదు. రవితేజ ఆ పాత్రకు జీవం పోశాడు. ఆయనను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం అని అన్నారు.

విక్రమార్కుడు సినిమా రికార్డు స్థాయిలో 100 రోజులు ఆడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 54 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకొన్నది. ఈ సినిమా అమెరికాలో అప్పట్లో 4.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇండియాలో 19 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా 25 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు లాభాలను సంపాదించింది.
అలాంటి బ్లాక్ బస్టర్ కథతో రూపొందిన విక్రమార్కుడికి కథని అందించిన విజయేంద్ర ప్రసాద్.. ఈ మూవీకి సీక్వెల్‌ను తీసుకు రావాలనే ఆలోచన చేశారు. అయితే రాజమౌళి ఆ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో మరో డైరెక్టర్‌తో ఆ సీక్వెల్‌ను తీసుకు వస్తామంటూ తెలియజేసారు. తాజాగా ఈ సీక్వెల్ గురించి భీమా మూవీ నిర్మాత కేకే రాధా మోహన్ ఆసక్తికర వివరాలు వెల్లడించారు. అసలు విక్రమార్కుడు 2 ఉందా లేదా..? ఉంటే కథ సిద్ధంగా ఉందా..? దానిని ఎవరు డైరెక్ట్ చేస్తారు..? అనే విషయాలను తెలియజేసారు.
కేకే రాధా మోహన్ మాట్లాడుతూ.. "విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉంది. విజయేంద్ర ప్రసాద్ గారే ఈ సీక్వెల్ కి కథని అందిస్తున్నారు. సంపత్ నంది ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారు. అయితే రవితేజ ఈ సీక్వెల్‌పై పెద్ద ఆసక్తి చూపడం లేదు. ఆయనని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ విక్రమార్కుడు 2 టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించి ఉంచాం. రవితేజ గారు ఒప్పుకుంటే.. వెంటనే సీక్వెల్ మొదలుపెట్టెసే వాళ్లం. కానీ ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వపోకపోతే, ఆ సీక్వెల్‌ను పక్కన పెట్టెస్తాం. మరో హీరోతో తెరకెక్కించే ఆలోచన అసలు లేదు" అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రవితేజ ఫ్యాన్స్ అయితే ఈ సీక్వెల్ రావాలని కోరుకుంటున్నారు. కానీ రవితేజ మాత్రం.. విక్రమార్కుడులో ఉన్న సోల్ అండ్ ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతే ఎదురుదెబ్బ ఎదురుకోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 'కిక్' మూవీ విషయంలో రవితేజ అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. మరి ఈ సీక్వెల్ విషయంలో ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











