అన్న అర్జున్ రెడ్డి.. తమ్ముడు గోవిందం!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఫ్యామిలీ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండని వదిలేలా లేరు. ఇప్పటికే షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగనే ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కన్ను విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ పై పడ్డట్లుంది.
గత ఏడాది విడుదలైన గీత గోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 70 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ రాబట్టింది. ఇవి స్టార్ హీరో సినిమాల రేంజ్ వసూళ్లు. ఈ చిత్రాన్ని హిందీలో రిమేక్ చేయాలనీ ఇషాన్ ఖట్టర్ భావిస్తున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తన ఇమేజ్ కు సరిపోతుందని ఇషాన్ ఖట్టర్ భావిస్తున్నాడట.

గీత గోవిందం హిందీ రీమేక్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దర్శకుడు ఎవరు, ఇషాన్ ఖట్టర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు తదితర అంశాల విషయంలో క్లారిటీ రావలసి ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని పరుశురాం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇషాన్ ఖట్టర్ యువ హీరోగా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.


Click it and Unblock the Notifications











