మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ.. బన్నీ విషయంలో నోరు విప్పిన హైపర్ ఆది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం సినీ పరిశ్రమ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరపున నిలిచిన సంగతి తెలిసిందే. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలతో పాటు అన్న నందమూరి తారక రామారావు, నరేంద్ర మోడీలపై అభిమానంతో మెజారిటీ ఇండస్ట్రీ ప్రముఖులు కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు. వెండితెరే కాకుండా బుల్లితెర సెలబ్రెటీలు కూడా కూటమికి జైకొట్టారు. కొందరు ప్రత్యక్షంగా , మరికొందరు పరోక్షంగా ప్రచారం సైతం చేశారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో సెలబ్రెటీలు వాలిపోయారు. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వరుణ్ తేజ్.. జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, కిరాక్ ఆర్పీ.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బుల్లితెర నటుడు సాగర్ తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వీరిపై వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వారు పవన్ కళ్యాణ్ వైపే నిలబడ్డారు. అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తే.. అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు.

ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగియనుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తల్లితో కలిసి పిఠాపురం వెళ్లి కుక్కుటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా బాబాయ్ పవన్ కళ్యాణ్‌ని కలిసి సంఘీభావం ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో మరో మెగా హీరో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి ప్రచారం చేశారు. దీనిని మెగా, పవన్ అభిమానులతో పాటు కూటమి శ్రేణులు తప్పుబట్టాయి. నాటి నుంచి బన్నీ వీరికి శత్రువుగా మారిపోయారు. స్వయంగా కుటుంబ సభ్యులు నాగబాబు, సాయిథరమ్ తేజ్‌లే అల్లు అర్జున్‌పై ఓ రేంజ్‌లో ఆగ్రహం వెళ్లగక్కారు.
మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉండేవాళ్లు, అభిమానులు బన్నీ పేరు చెబితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జబర్దస్త్ కిరాక్ ఆర్పీ అయితే శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడాన్ని తప్పుబడుతూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శించారు. పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీకి బన్నీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానని చెప్పుకొచ్చారు. నిన్నగాక మొన్న గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా అయితే అల్లు అర్జున్ ఉండే సినిమాలో తాను నటించనని కుండబద్ధలు కొట్టారంటే బన్నీపై మెగా ఫ్యాన్స్ ఎంత ఆగ్రహంతో ఉన్నారో చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ వద్దంటూ హైపర్ ఆది సూచించారు. ఆయన లేటెస్ట్‌గా నటించిన శివం భజే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆది.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ పొందిన బన్నీని గౌరవించాల్సిన అవసరముందన్నారు. పవన్ కళ్యాణే కాదు మెగా ఫ్యామిలీలో ఎవరికి అల్లు అర్జున్‌పై కోపం లేదని.. వారంతా ఎప్పుడూ ఒకటేనని క్లారిటీ ఇచ్చారు. కానీ కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారని , ఇలాంటి చర్యలను ఇకనైనా ఆపాలని హైపర్ ఆది హితవు పలికారు.


Click it and Unblock the Notifications











